తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయిన విజయశాంతి, తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన న్యూనత ఏర్పడింది. దీంతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్టు కూడా కథనాలు వస్తున్నాయి. ఇదే తరుణంలో విజయశాంతి అక్కడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమౌతుండటం విశేషం.
నిజానికి, తెలంగాణ రాజకీయాల్లో కొన్నాళ్లపాటు కీలక పాత్ర పోషించారు రాములమ్మ. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరడంతో విజయశాంతి పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. ఆ తరువాత, తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. అటుపై తెరాసలో విలీనం చేశారు. కానీ, ఎక్కువ కాలం అక్కడా కొనసాగలేకపోయారు. సరిగ్గా రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఆమె తెరాసకు నెమ్మదిగా దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి దిగినా అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దాంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే, కొన్నాళ్ల కిందట ఆమె తెరాసలోకి తిరిగి చేరొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, అదేదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తమిళనాడులో చిన్నమ్మ వర్గం తరఫున ఆమె రంగలోకి దిగబోతున్నారట.
అన్నా డీఎంకే పార్టీలోకి విజయశాంతిని తీసుకుని రావడంలో దినకరన్ కీలక పాత్ర పోషించినట్టు కథనాలు వస్తున్నాయి. రాములమ్మను వేదిక మీదికి తీసుకుని రావడం ద్వారా తమిళనాట కొత్త రాజకీయాలకు ఆస్కారం ఉంటుందని చిన్నమ్మ శశికళను దినకరన్ ఒప్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఓ గంట సేపు శశికళతో విజయశాంతి భేటీ కావడం విశేషం. నిజానికి, ఇంతకుముందే చిన్నమ్మ వర్గానికి విజయశాంతి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలు రద్దు కాకముందు.. శశికళ వర్గం తరఫున ప్రచారం చేశారు.
విజయశాంతిని తమిళ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. ఒక సినీ నటిగా తమిళనాడులో విజయశాంతికి మంచి గుర్తింపే ఉంది. లేడీ అమితాబ్ బచ్చన్ గా ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే, ఇప్పుడు తమిళనాడులో చిన్మమ్మ శశకళ, దినకరన్ వర్గంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పక్కన చేరేందుకు వెళ్తున్న రాములమ్మకు ఎలాంటి అనుభవం ఎదురౌతుందో వేచి చూడాలి. ఇంతకీ, విజయశాంతిని ఏరికోరి చిన్నమ్మ వర్గం ఎందుకు ఆహ్వానిస్తోందంటే.. పార్టీలో బలమైన మహిళా నేత అవసరమని దినకరన్ భావిస్తున్నారట! ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే అన్నీ జరిగితే విజయశాంతి పొలిటికల్ కెరీర్ లో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే.