హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్లకు విస్తరిస్తున్నారు. దీనికి సంబంధించి టెండర్లను పిలిచారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజానికి గతంలో ఈ పని కోసం జీఎంఆర్ సంస్థ టెండర్లు దక్కించుకుది.కానీ అర్ధాంతరంగా వైదొలగడంతో దాని స్ధానంలో మరో కాంట్రాక్టర్ ను ఎంపిక చేసేందుకు కొత్త టెండర్లు పిలిచారు. ఈ మేరకు రూ.700 కోట్ల బడ్జెట్ తో ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు టెండర్లు పిలిచారు.
తెలంగాణ రాష్ట్రం పరిధిలో 181 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని గతంలో నాలుగు లైన్లుగా విస్తరించారు. ఆరు లైన్ల విస్తరణకు సరిపడా భూసేకరణ జరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా భూసేకరణ అవసరం లేదు. టెండర్ అయిపోగానే వెంటనే పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇది పూర్తయితే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ వేగం పెరగనుంది.
అత్యంత రద్దీ హైవేలను ఆరు వరుసలుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే NHAI పరిధిలోని ప్రాజెక్టులతో రాష్ట్రం కూడా తన అవసరాలకు తగ్గట్లుగా ప్రాజెక్టులను కలపడం వల్ల భారీగా నిధులు ఆదా అవుతాయని.. కొత్త ఇన్ ఫ్రా రూపుదిద్దుకుంటుందని నమ్మకంతో ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య ఆరు లైన్ల రహదారి ఎంత వేగంగా పూర్తయితే.. అంతగా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.