ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో ఒకటైన విజయవాడలో .. వైసీపీ తరపున పోటీ చేస్తున్న పొట్లూరి వరప్రసాద్‌కు… గతంలో తాను చేసిన వ్యాఖ్యలు … గుదిబండగా మారాయి. ఓ వ్యాపార సమావేశంలో ” ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్ట్ ” దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని.. తేలిగ్గా తీసి పడేశారు. ఇది మాట్లాడి కొంత కాలం అయింది. అప్పట్లో ఈ ప్రోగ్రాంని ఎవరూ పట్టించుకోలేదు. అంత అవసరం కూడా రాలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన రాజకీయాల్లో లేరు. ఆయన అభిప్రాయంతో ఎవరికీ పని లేదు. కానీ ఇప్పుడు.. వైసీపీ తరపున బరిలో నిలిచారు. దాంతో ఆ వీడియోను బయటకు తెచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చాలా స్పష్టంగా ” ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్ట్ ” అని తీసి పడేయడంతో.. విజయవాడ ప్రజలు నివ్వెరపోవాల్సి వస్తోంది.
తెలుగుదేశం పార్టీ నేతలకు ఈ వీడియో అస్త్రంలా దొరికింది. వెంటనే.. తమ తమ మార్గాల్లో మరింత విస్తృతంగా దాన్ని ప్రచారం చేయడమే కాకుండా.. మీడియాలోనూ చర్చకు పెట్టారు. దీన్ని కవర్ చేసుకోవడానికి పీవీపీ తంటాలు పడుతున్నారు. అసలు స్పీచ్ మొత్తం వినకుండా.. ఆ ఒక్క భాగాన్నే హైలెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఆ స్పీచ్‌లో హోదా గురించి ఆ ఒక్క మాటే మాట్లాడారు. మిగతా అంశాలు… హోదాకు సంబంధం లేనివి. ఆయన చెప్పిన మాటలు.. కవర్ చేసుకోవడానికన్నట్లు ఉండటంతో… ఆయన ఇమేజ్‌కు భారీగా డ్యామేజ్ ఏర్పడుతోంది. అదే సమయంలో… జగన్ అక్రమాస్తుల కేసుల్లో పీవీపీ వ్యవహారాలను… కేశినేని బయటపెట్టారు.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో పీవీపీ కూడా ఓ నిందితుడు. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని బలంగా ప్రజల్లోకి తీసుకెల్తున్నారు. ప్యారడైజ్ పేపర్లలో పీవీపీ అంతర్జాతీయ మోసం ఎలా చేశారో వివరించారని, ప్రస్తుతం సుప్రీంకోర్టు బెయిల్ మీద ఉన్న వ్యక్తి అని ఆధారాలు బయట పెట్టారు. జగన్ అవినీతి డబ్బును హవాలా చేసింది పీవీపీనేనని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నాదర్ భూముల కుంభకోణంలో పీవీపీ ప్రధాన సూత్రధారి అన్నారు. గత ఎన్నికలలో జగన్ తో జెలుకెళ్లి వచ్చిన వ్యక్తిని బెజవాడ ప్రజలు తిసర్కరించారని కోనేరు ప్రసాద్ గురించి వ్యాఖ్యానించి.. ఇప్పుడు జగన్ డబ్బును హవాలా చేసి ఈడీ కేసులలో ఇరుక్కున్న పీవీపీ కి కూడా ప్రజలే తగిన బుద్ది చెప్పాలని నాని పిలుపునిచ్చారు. ఈ వీడియో పుణ్యమాని పీవీపీ పై వ్యతిరేక చర్చ బెజవాడ ప్రజల్లో జరుగుతోంది