ఈమధ్య ‘బాయ్ కాట్’ బెంగ పట్టుకొంది సినిమా వాళ్లకు. ఎవరి మనోభావాలు ఎప్పుడు దెబ్బ తింటాయో తెలీదు. ఎవరు ఏ సినిమాని ఎందుకు బాయ్ కాట్ చేస్తారో అస్సలు తెలీదు. బాలీవుడ్లో ఈ సంస్క్రృతి ఎక్కువైంది. అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దాని బాయ్ కాట్ చేశారు. అంతకు ముందు కంగనా రనౌత్ సినిమాలకూ బాయ్ కాట్ పిలుపు నిచ్చారు. బాయ్ కాట్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ‘లైగర్’ని కూడా బాయ్ కాట్ చేస్తామని బెదిరించింది ఓ వర్గం. అయితే వాళ్లెవరూ బాయ్ కాట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ సినిమా సర్దేసుకుంది. అందుకే బాయ్ కాట్ ఉద్యమం గురించి ఏం మాట్లాడాలన్నా.. భయ పడుతున్నారు సినిమా వాళ్లు.
‘కోబ్రా’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చాడు విక్రమ్. ఈ సందర్భంగా బాయ్ కాట్ గురించిన ప్రశ్న విక్రమ్ కి ఎదురైంది. ”ఈమధ్య బాయ్ కాట్ అంటూ సినిమాల్ని బహిష్కరిస్తున్నారు కదా, ఓ సినిమా వాడిగా మీ అభిప్రాయం ఏమిటి“ అంటే… విక్రమ్ అమాయకంగా ”నాకు బాయ్ తెలుసు, గాళ్ ఇంకా బాగా తెలుసు. ఈ బాయ్ కాట్ ఎవరు” అని ప్రశ్నించాడు. దాన్ని బట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం విక్రమ్ కి ఎంత మాత్రం ఇష్టం లేదన్న విషయం అర్థమైపోయింది. గత కొన్నేళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న విక్రమ్ ఈ సారి ఎలాగైనా తనని తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. తన ఆశలన్నీ ‘కోబ్రా’పైనే. ఈనెల 31న ఈచిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమాపై ఎలాంటి నెగిటీవ్ ఎఫెక్ట్ పడకూడదని విక్రమ్ భావిస్తున్నాడు. అందుకే వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం లేదు.