ఈ వారం విడుదలవుతున్న ఓ చిన్న సినిమా `రెండు రెళ్లు ఆరు`. ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ ఆసుపత్రిలో ఒకేసారి రెండు కాన్పులు జరుగుతాయి. ఓచోట బాబు పుడితే, మరో చోట అమ్మాయి పుడుతుంది. ఆ ఇద్దరూ.. తారుమారు అవుతారు. వాళ్లే పెద్దయ్యాక ప్రేమలో పడతారు. కొడుకు తన ఇంటికే అల్లుడిగా వస్తాడు. కూతురు… తన ఇంటికి కోడలుగా వెళ్తుంది. అదీ.. కథ. విక్రమ్ కె.కుమార్ – అఖిల్‌ల కోసం అనుకొన్న సబ్జెక్ట్ కూడా అదే. స్క్రిప్టు పూర్తయ్యేలోగా ఈ సినిమా ఆగిపోయింది. `రెండు రెళ్లు ఆరు`, అఖిల్ సినిమా కథ రెండూ ఒకటే అయినప్పుడు ఎవరు ఎవరిని కాపీ కొట్టాలని చూశారు? అనే ప్రశ్న ఉద్భవించడం తథ్యం.
ఈ ఎపిసోడ్లో మాత్రం ‘రెండు రెళ్లు ఆరు’ కథనే విక్రమ్ కె.కుమార్ కాపీ కొట్టాలని చూశాడని తెలుస్తోంది. ‘రెండు రెళ్లు ఆరు’ కథని ఆ చిత్ర దర్శకుడు చాలామందికి చెప్పాడు. అందులో ఒకరు.. విక్రమ్‌కి సన్నిహితుడట. ఆ కథని విక్రమ్ దగ్గర లీక్ చేసి పాడేశాడు. ‘ఈ పాయింట్ ఏదో భలే వుందే’ అనుకొన్న విక్రమ్ దానికి సొంత తెలివి తేటలు జోడించి.. నాగ్‌కి వినిపించడం, నాగ్ ఓకే చెప్పడం జరిగిపోయాయి. అయితే.. సదరు సంగతి తెలుసుకొన్న ‘రెండు రెళ్లు ఆరు’ టీమ్… విక్రమ్‌ని నిలదీసింది. ”మా కథ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఈ కథతోనే సినిమా ఎలా తీస్తారు?” అని అడగడంతో… విక్రమ్ తన తప్పు తెలుసుకొని, ఆ స్క్రిప్టుని పక్కన పెట్టేశాడు. అదీ.. విక్రమ్ – అఖిల్ రెండు రెళ్లు ఆరు కథ.