సవాళ్లు ఎదురైనప్పుడే ఐడియాలు వస్తాయని చెబుతూ ఉంటారు. ఏపీ అధికారులకు ఇలాంటి ఐడియాలు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి జిరాక్స్ దుకాణాలు ఏర్పాటు చేయింంచాలని.. అలా చేయడం ద్వారా కనీసం రూ. పన్నెండు వందలు వస్తాయని.. వీటితో ఆ గ్రామ, వార్డు సచివాలయానికి అవసరమైన నిర్వహణ ఖర్చులు అంటే… స్టేషనరీ ఖర్చులు వస్తాయని అధికారులు నివేదిక రూపొందించారు.
ఈ ఐడియా .. మహేష్ సినిమా డైలాగ్‌లా మైండ్ బ్లోయింగ్‌గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనేక చోట్ల .. కాదు అత్యధిక చోట్ల గ్రామ, వార్డు సచివాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. అద్దె కట్టడం లేదని చాలా మంది యజమానులు తాళాలు వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాము అద్దెకు తీసుకున్న వాటిని మళ్లీ అద్దెకు ఇచ్చి జిరాక్స్ దుకాణాలు పెట్టించాలనుకుంటున్నారు. గతంలో ఫిష్ మార్టులు పెట్టించాలన్న ఆలోచన చేశారు. అదేమైందో తెలియడం లేదు కానీ.. కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు.
ఇప్పటికే చేపలు అమ్ముకునేవారిని కూడా వదిలి పెట్టకుండా వారి వ్యాపారాలనూ ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆరోపణలు వస్తూండగా.. తాజాగా జిరాక్స్ దుకాణాలను నడుపుకునేవారికీ టెండర్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. నిజానికి గ్రామ, వార్డు సచివాలయాకు వచ్చే వారికి జిరాక్స్ పనులు ఉంటాయి. ఈ కారణంగానే ఈ బిజినెస్ పెట్టాలని ప్రభుత్వానికి ఆలోచన వచ్చినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా ఏపీ అధికారులకు డబ్బుల సంపాదన ఐడియాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ రేంజ్లో వస్తున్నాయి. వీటిని ప్రజలు తట్టుకోగలరో లేదో మాత్రం అంచనా వేయడం కష్టం.