ప్రస్తుతం చిత్రసీమ బాలీవుడ్ వైపు చూస్తోంది. భారీ పారితోషికాలు ఇచ్చి మరీ, అక్కడి నుంచి విలన్లను దిగుమతి చేసుకుంటోంది. సినిమాకి పాన్ ఇండియా టచ్ ఇవ్వడంలో ఇది ఓ కీలకమైన భాగం అయిపోయింది. చిరంజీవి `వేదాళం` రీమేక్ కోసం కూడా బాలీవుడ్ విలన్ ని దిగుమతి చేయబోతున్నట్టు టాక్. అందుకోసం కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు పరిశీలిస్తున్నార్ట. ఇప్పటికే మెహర్ రమేష్ కొంతమంది పేర్లతో ఓ లిస్టు తయారు చేశాడని, చిరంజీవి ఫైనల్ చేస్తే… ప్రతినాయకుడి ఎంపిక కూడా ఖాయమైపోయినట్టే అని టాక్.
చిరు సోదరిగా కీర్తి సురేష్ పేరు దాదాపు ఖాయమైపోయింది. విలన్ ని కూడా సెట్ చేసేస్తే… ఓ పెద్ద పనైపోయినట్టే. ఎందుకంటే.. కొన్ని సినిమాలకు సరైన విలన్ దొరక్క దర్శకులు ఇబ్బంది పడుతున్నారు. బాలకృష్ణ – బోయపాటి చిత్రానికి ఇంకా విలన్ సమస్య అలానే ఉంది. చాలా మంది పేర్లు అనుకున్నారు గానీ ఎవరూ ఫైనల్ కాలేదు. విలన్ ఎంపిక కాకపోవడం వల్ల ఆ సినిమా మరింతగా ఆలస్యం అవుతోంది. ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ముందుగానే ప్రతినాయకుడ్ని ఫిక్స్ చేసుకోవాలని `వేదాళం` టీమ్ భావిస్తోంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.