టీమిండియన్ టెస్టు కెప్టెన్.. ఈ తరం క్రికెటర్లలో సచిన్ కు ధీటుగా ఆదరణ సంపాదించుకుంటున్న ఆటగాడు… ఇలాంటి నేపథ్యంతో అతడి సంపాదన ఒక రేంజ్ కు వెళ్లిపోయింది. వద్దన్నా కోట్ల రూపాయలు వచ్చి పడిపోయే పరిస్థితి. సంపాదించడంలోనే కాదు.. జీవనశైలి ఖర్చు విషయంలో కూడా విరాట్ స్థాయి ఒక రేంజ్ లోనే ఉంది. ఇటీవలే అరేబియా తీరంలో దాదాపు నలభై కోట్ల రూపాయల పై స్థాయి మొత్తాన్ని పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు విరాట్. మరి అపార్ట్ మెంట్ లో నివాసం కోసమే అంత ఖర్చు పెట్టాడు అంటే.. ఈ క్రికెటర్ జీవన శైలి ఎ లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఇలాంటి సంపాదన పరుడికి లీటర్ నీళ్లకు రూ.600 పెట్టడం పెద్ద కథేమీ కాకపోవచ్చు! అయితే సగటు భారతీయుడి కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం.. లీటర్ నీళ్లు రూ.600 రూపాయలా! అనే ఆశ్చర్యం మాత్రం తప్పదు. విరాట్ కు ఎక్కడకు వెళ్లినా ఎవియాన్ అనే బ్రాండ్ మినరల్ వాటర్ తప్పనిసరిగా ఉండాలట. వీటి ధర లీటర్ కు ఆరువందల రూపాయలు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు.
అత్యంత లోతట్టు నుంచి మోటర్ల ద్వారా తవ్వితీసిన ఈ నీటిని గాలి కూడా తాకకుండానే ప్యాక్ చేస్తారట. దీని వల్ల ఈ నీటికి కాలుష్యం దరి చేరదు. ఇలాంటి నీటిని సేవించడం శరీరానికి మేలు చేస్తుంది అని నమ్మకం. కేవలం విరాటే కాదు.. అనేక మంది శ్రీమంతులు ఇలా విదేశాల నుంచి నీటిని దిగుమతి చేసుకుని తాగుతున్నారు.