విప్లవం… ప్రణయం.. రెండింటికీ ముడి పెట్టిన కథ ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన చిత్రమిది. రానా, సాయి పల్లవి నటించారు. ఈనెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు.
3 నిమిషాల పాటు సాగిన ట్రైలర్ ఇది. చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ కథతో దర్శకుడు ఏం చెప్పబోతున్నాడో, ట్రైలర్లో అర్థమయ్యేలా చూపించారు. వెన్నెల అనే అమ్మాయి.. రఘన్న అనే విప్లవకారుడి రచనలకు అభిమానిగా మారిపోతుంది. తనని ప్రేమిస్తుంది. ‘ఒక్కసారైనా తనని చూడాలి’ అని కలలు కంటుంది. పూజలు చేస్తుంది. అలాంటి అమ్మాయికి రఘన్న ఎదురు పడతాడు. వారిద్దరి మధ్య ఓ ప్రయాణం మొదలవుతుంది. రఘన్న ఆలోచనలు, ఆశయాలు వేరు.. వెన్నెల జీవితం వేరు. ఈ రెండింటికీ ఎలా ముడి పడిందన్నదే ఈ సినిమా.
భూర్జువా వ్యవస్థ, నక్సల్ ఉద్యమం, పోలీసుల అరాకచాలు, తుపాకీల శబ్దం, మారణకాండ, రక్తపాతం.. వీటి మధ్య సాగే ప్రేమకథ ఇది. సంభాషణలు, ఆ విజువల్స్.. పవర్ఫుల్గా ఉన్నాయి. ”ఇక్కడ రాత్రుండదు.. పగలుండదు… ఉన్నతంతా ఊపిరి ఊపిరికి మధ్య ఊపిరి సలపనంత యుద్ధం మాత్రమే”, ”తుపాకీ గొట్టంలో శాంతి దొరకదు”, ”నీ రాతల్లో నేను లేకపోవొచ్చు.. కానీ తలరాతలో మాత్రం తప్పకుండా ఉంటా”.. ఇలాంటి డైలాగులు ఆకట్టుకొంటున్నాయి. యుద్ధం కంటే ప్రేమ గొప్పదని, యుద్ధాలతో ప్రాణాలు నిలపొచ్చని నమ్మిన ఓ వెన్నెల కథ ఇది. ప్రియమణి, నందితా దాస్ లాంటి మేటి నటులు తెరపై కనిపిస్తున్నారు. టెక్నికల్ టీమ్ కూడా బాగా కష్టపడింది. కచ్చితంగా తెలుగు తెరపై ఓ వైవిధ్యభరితమైన సినిమా రాబోతోందన్న నమ్మకం.. విరాటపర్వం ట్రైలర్ కల్పించింది.