ఏపీ బీజేపీ నేతలు జోష్ మీద ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రైల్వేజోన్ ప్రకటించబోతున్నారన్నంత ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉత్సాహాన్ని మీడియా ప్రతినిధులు కూడా అసలు పట్టలేకపోతున్నారు. 10 రోజుల్లో విశాఖ ప్రజలు శుభవార్త వింటారుని… విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. విశాఖ రైల్వేజోన్ తీసుకొచ్చే బాధ్యత మాదేనని చాలెజ్ చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేది మేమే ..తెచ్చేది మేమే అని భారీ డైలాగులు కూడా అసువుగా చెప్పేస్తున్నారు. విశాఖలో మోడీ సభను అడ్డుకుంటామంటున్నారని… ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చినందుకా? రైల్వే జోన్ ఇస్తామని చెప్పినందుకా? అని ఆవేశ పడిపోతున్నారు.
అయితే.. మరో నాలుగు రోజుల్లోనే… ప్రధానమంత్రి మోడీ సభ విశాఖలో ఉంది. మార్చి ఒకటో తేదీనే సభను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. విష్ణుకుమార్ రాజు.. పది రోజుల సమయంలో… విశాఖ ప్రజలు మంచి వార్త వింటారని చెప్పడంలో.. ఔచిత్యం ఏమిటో… సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. ఒక వేళ ఇవ్వాలి అని కేంద్రం అనుకుంటే… ప్రధాని సభను మించిన సందర్భం ఏమీ ఉండదు. ప్రధాని నేరుగా.. రైల్వేజోన్ ప్రకటిస్తే.. బీజేపీ నేతలకు చెప్పుకోవడానికి ఓ కారణం అయినా.. ఉంటుంది. దాన్ని చూపించి కనీసం ప్రజల్లోకి వెళ్లగలరు.
కానీ విష్ణుకుమార్ రాజు.. వ్యవహారశైలి చూస్తూంటే.. మొదటికే తేడా తీసుకొచ్చేలా ఉన్నారు. కేవలం రైల్వే జోన్ ప్రకటిస్తారనే ఆశ కల్పించి.. మోడీ సభను విజయవంతం చేసుకుని..సైలెంట్ అవడానికే.. విష్ణుకుమార్ రాజు.. పది రోజుల్లో శుభవార్త వింటారనే… విధంగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు సహజంగానే రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. అంతగా ఇచ్చే పని అయితే..మోడీ సభలో ప్రకటిస్తారు లేకపోతే లేనట్లే. ఎందుకంటే.. ఒకటో తారీఖు తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇవ్వడానికి అవకాశం లేదు.