విశాఖ ఉత్తర నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, 23వ తేదీన కౌంటింగ్ తర్వాత ఆ హోదా ఉంటుందో లేదోనని.. టెన్షన్ పడుతున్న విష్ణుకుమార్ రాజు.. తనపై పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరవుపై..పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. విశాఖలో ఓ రేవ్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది. ఇప్పుడు తీరిగ్గా… ఆ రేవ్ పార్టీకి మంత్రి గంటాకు లింక్ పెట్టేందుకు… విష్ణుకుమార్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా.. ఈ వ్యవహారంపై.. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతున్నప్పటికీ.. ఎప్పుడూ నేరుగా… మంత్రి గంటా పేరు ప్రస్తావనకు తీసుకు రాలేదు. హఠాత్తుగా.. ఏపీ సచివాయానికి వచ్చిన విష్ణు కుమార్ రాజు..
గంటా శ్రీనివాసరావుపై చాలా పెద్ద కంప్లైంటే చేశారు. విశాఖలో జరిగిన రేవ్ పార్టీ వెనుక ఓ మంత్రి హస్తం ఉందని…సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. విశాఖను డ్రగ్ సిటీగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.
కోడ్ ఉన్నప్పుడు బీచ్‌లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదని.. అయినా సరే అధికారులపై ఒత్తిడి చేసి లైసెన్స్‌లు తీసుకున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి పేషీ నుంచి 8 సార్లు ఫోన్ చేశారని.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుకు మంత్రి పీఏ ఫోన్ చేసి ఒత్తిడి చేశారని చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని… ఆయనఅనుకోవడం లేదు. రాజకీయ అంశంగా మార్చి.. మంత్రి గంటాను ఇరుకున పెట్టాలనుకుంటున్నారు. అందే… తానుచ ేసిన ఫిర్యాదుపై.. వైసీపీ, జనసేన స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా…మీడియా ముందు ఎన్నికలు జరిగిన తీరుపైనా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో విశాఖ నార్త్‌లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని మండిపడ్డారు.
విష్ణుకుమార్ రాజు.. మొదటి నుంచి… తనకు పోటీకిగా.. టీడీపీ అభ్యర్థి గంటాను మాత్రమే భావించారు. ఓ సందర్భంలో.. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కేకే రాజు.. విష్ణుకుమార్ రాజు పోటీ నుంచి వైదొలిగి తనకు మద్దతు ఇస్తున్నారని కూడా ప్రచేశారు. ఆ వ్యాఖ్యలను విష్ణుకుమార్ రాజు ఖండించారు కానీ..గంటాపైనే ఎక్కువ విమర్శల దాడి చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ వేడి తగ్గనీయడం లేదు. మరో వైపు గంటా మాత్రం… రిసార్టుల్లో మనవడితో ఆడుకూంటూ.. మీడియాతో ఫోటోలు లీక్ చేస్తున్నారు.