విశ్వక్ సేన్ నుంచి ఓ సినిమా వస్తోంది. అదే ‘గామి’. ఈనెల 8న విడుదల కాబోతోంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. విజువల్స్ ఆకట్టుకొంటున్నాయి. ఏదో బలమైన ఫిలాసఫీకి, ఫాంటసీ టచ్ ఇచ్చి తీసిన సినిమాలా అనిపించింది. విశ్వక్సేన్ ఇమేజ్‌కీ ఈ కథకూ, అందులోని విశ్వక్ పాత్రకూ పొంతనే కనిపించడం లేదు. నిజానికి ఇది ఇప్పటి సినిమా కాదు. విశ్వక్ హీరోగా ప్రయత్నాలు చేస్తున్న కొత్తలో ఒప్పుకొన్న సినిమా. అప్పటికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా రాలేదు. అంటే దాదాపు పదేళ్ల క్రితం చేసిన సినిమా అన్నమాట. నిర్మాణంలో చాలారకాల ఆటు పోట్లు ఎదుర్కోవడం వల్ల, ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదల అవుతోంది.
అప్పట్లో అవకాశం రావడమే గొప్ప అనుకొన్న దశలో విశ్వక్‌కి వచ్చిన ఛాన్స్ ఇది. అప్పటికి విశ్వక్‌కి ఎలాంటి ఇమేజ్ లేదు. కాబట్టి… ఈ సినిమా ఒప్పేసుకొన్నాడు. అదే ఇప్పుడైతే ఈ సినిమా చేద్దుడో, లేదో..?! కాకపోతే నటుడిగా తొలి అడుగులేస్తున్న సమయంలో చేసిన సినిమా కాబట్టి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ”నా కెరీర్లో ఇది చాలా ప్రత్యేకమైన సినిమా, మనసు పెట్టి చేసిన సినిమా, ఓ జ్ఞాపకంలా మిగిలే సినిమా” అని, ‘గామి’ గురించి గొప్పగా చెబుతున్నాడు విశ్వక్. తన సినిమాల్లో కనిపించే రెగ్యులర్ ఎమోషన్స్ ఇందులో లేవని ముందే ప్రిపేర్ చేస్తున్నాడు. విజువల్స్ కూడా ‘పాత సినిమా’ అనే ఫీలింగ్ తీసుకురావడం లేదు. సినిమాలో విషయం ఉందన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. కొన్ని సినిమాలు లేటుగా విడుదలైనా మంచి ఇంపాక్ట్ అయితే తీసుకొస్తాయి. ‘గామి’ కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి.