వివేక్ ఆత్రేయ మంచి రైటర్. క్లీన్ సినిమాలు తీస్తాడు. ఈ విషయంలో తిరుగులేదు. ‘అంటే సుందరానికి’ మంచి సినిమానే. కానీ.. రన్ టైమ్ తో సమస్య వచ్చి పడింది. సినిమాని క్రిస్పీగా, షార్ప్‌గా చూడడానికి అలవాటైన తరంలో ఉన్నప్పుడు.. వాళ్ల అభిరుచులకు తగ్గట్టుగానే సినిమా తీయాలి. ఆ విషయంలో వివేక్ ఆత్రేయ ఫెయిల్ అయ్యాడు. ‘అంటే సుందరానికి’ యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోవడానికి కారణం అదే. అయితే అదే తప్పు ‘సరిపోదా శనివారం’ సినిమాలోనూ చేశాడు. ఈ సినిమాలోకి అదో పెద్ద మైనస్. కనీసం 20 నిమిషాల సినిమా ట్రిమ్ చేస్తే బాగుంటుందని అన్ని రివ్యూలూ తేల్చేశాయి. ఇదే విషయం వివేక్ ఆత్రేయని అడిగితే.. ”అసలు రన్ టైమ్ సమస్యే కాదు. నాకెక్కడా సినిమా లాగ్ అయిన ఫీల్ లేదు. ప్రేక్షకులూ అలానే అనుకొంటున్నారు. రాసిన ప్రతీ సన్నివేశం తెరపై చూసుకోవాలన్న తపన నాకు లేదు. సినిమాకు ఏం కావాలో అదే తీశాను. ఈ కథని ఇలానే చెప్పాలి. సగం సగం చెబితే కంటెంట్ అర్థం కాదు” అని కవర్ చేసుకొనే ప్రయత్నం చేశాడు.
ఇంత జరిగినా రన్ టైమ్ అసలు సమస్యే కాదన్నట్టు ఆత్రేయ మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తోంది. ఈరోజుల్లో ఓ సినిమా హిట్టు అవ్వడానికీ, యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోవడానికి కారణం ఇదే. సినిమా మొత్తం చూశాక నాని, ఇతర టెక్నీషియన్లు రన్ టైమ్ పై అభ్యంతరం తెలిపారని, వాళ్లు కూడా సెకండాఫ్‌ని ట్రిమ్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారని కానీ.. వివేక్ ఆత్రేయ పట్టించుకోలేదని తెలుస్తోంది. విడుదలకు ముందు ఈ డ్యూరేషన్ విషయంలో గట్టిగా డిస్కర్షన్ నడిచింది. తరవాత కూడా నడుస్తూనే ఉంది. అయినా సరే, ఈ విషయాన్ని వివేక్ ఆత్రేయ ఒప్పుకోవడం లేదు. ఎవరి బిడ్డ వాళ్లకు ముద్దు కదా?