రెండ్రోజులుగా కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ చేస్తున్న కర్నాటక వాల్మీకి స్కాంపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ను ఓడించేందుకు తాను పనిచేశానన్న కారణంతోనే తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కర్నాటక వాల్మీకి కార్పోరేషన్ నుండి వీ6 పేరుతో ఉన్న బిజినెస్ సంస్థకు డబ్బులు బదిలీ చేశారని, అవే డబ్బులను కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు కేటీఆర్ ఆరోపించారు. వీ6 సంస్థ వివేక్ వెంకటస్వామిది అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపించింది.
అయితే, సదరు వీ6 బిజినెస్ కు తనకు సంబంధం లేదని వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తనకు ఛానెల్, పేపర్ ఉన్నాయని… అవి మూయించేందుకు గత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించినా, నెగ్గుకు వచ్చామన్నారు. సంస్థ ఎవరిదో తెలియకుండా ప్రచారం చేయటం తగదన్నారు. వీ6 సంస్థలు వేరు… కేటీఆర్ చెప్పిన వీ6 బిజినెస్ సొల్యూషన్స్ వేరు అని తెలిపారు.
ఇక, చెరువును ఆక్రమించి ఫాంహౌజ్ కట్టుకున్నారన్న ఆరోపణలపై కూడా వివేక్ స్పందించారు. తాను ఆ ఫాంహౌజ్ కట్టుకోలేదని, అది కొన్నానని… కొనే నాటికే ఉందన్నారు. పైగా ఆ భూమి ఆక్రమించింది కాదని… ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే అది ఉందన్నారు.