ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను విజయసాయిరెడ్డి కబ్జా నుంచి బయటపడేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ క్లబ్ నుంచీ వైసీపీ నేతల్ని తరిమేశారు. వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్ విషయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా ACA కోశాధికారిగా ఉంటూ విజయసాయి బినామీగా ప్రసిద్ధి చెందిన గోపీనాథ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఐదేళ్లలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. టీడీపీ గెలిచిన తర్వాత… వైజాగ్ ఫిల్మ్ క్లబ్ లో అక్రమంగా చొరబడిన వారంతా తమంతట తామే వైదొలగాలని గంటా అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికి అందరూ రాజీనామా చేసి వెళ్లిపోయారు.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలో ఫిల్మ్ నగర్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. ఫిల్మ్ క్లబ్ లో 1,630 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది. ప్రభుత్వం మారిన తర్వాత కేఎస్ రామారావు వంటి సినీ నిర్మాతలతో ఉన్న కమిటీని బలవంతంగా తప్పించి… గోపీనాథరెడ్డి, కాయల వెంకటరెడ్డి, ప్రసాదరెడ్డి వంటి వారితో కోర్ కమిటీని నియమించారు. అప్పట్నుంచి వారిదే రాజ్యం. వైజాగ్ ఫిల్మ్‌నగర్ క్లబ్‌కు రామానాయుడు స్టూడియో కొండపై టీడీపీ హయాంలో 5ఎకరాల స్థలం కేటాయించారు. కానీ అధికారిక ప్రక్రియ పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు.
కానీ సభ్యత్వాలు ఇతర రుసుముల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఊడ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో సినీ రంగంతో సంబంధం లేని వారంతా.. స్వచ్చందంగా తప్పుకోవాలని సంకేతాలు వెళ్లాయి. చివరికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అందరూ రాజీనామా చేశారు. మళ్లీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల చేతుల్లోకి ఫిల్మ్ నగర్ క్లబ్ వెళ్లే అవకాశం ఉంది.