విశాఖ రామానాయుడు స్టూడియోను కూడా వైసీపీ నేతుల కబ్జా చేసేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆ స్టూడియోను చూసి వైఎస్ భారతి రెడ్డి మనసు పడ్డారని.. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించారని అయ్యన్నపాత్రుడులాంటి వాళ్లు చాలా సార్లు చెప్పారు. గతంలో స్టూడియో ను స్వాధీనం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రక్రియ ఏమయిందో కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు చేతులు మారిపోయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఈ విషయంలో రామానాయుడు స్టూడియో అధినేత సురేష్ బాబు ఎక్కడా ప్రకటనలు చేయలేదు. తమ స్టూడియోను ప్రభుత్వం తీసుకుందని కానీ.. లేకపోతే అమ్మేశామని కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే చేతులు మారిపోయిందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. గతంలో టిక్కెట్ల వివాదం జరిగినప్పుడు సురేష్ బాబు ఓ సందర్భంలో మాట్లాడుతూ..” తాను ఏపీలో సినిమాలు రిలీజ్ చేసుకోనని.. ధియేటర్లను కూడా మూసేస్తానని.. స్టూడియో విషయంలో న్యాయపోరాటం ” చేసుకుంటాను కానీ లొంగిపోయే ప్రసక్తే లేదన్నట్లుగా చెప్పారు.
కారణం ఏదైనా విశాఖలో రామానాయుడు స్టూడియోను కూడా వైసీపీ నేతలు సొంతం చేసుకుని ఉంటే… వారి కబ్జాలు ఇక ఊహించనంత స్థాయికి… భరించలేనంత రేంజ్‌కు చేరుకున్నట్లే. ఈ విషయంలో అసలు నిజాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే కబ్జాల భయంతో అందరూ వణికిపోతున్నారు. ఉత్తరాంధ్ర మైనింగ్ మొత్తం కడప నుంచి వచ్చిన వారి చేతుల్లోనే ఉంది.