భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపితే ఓ ఎమ్మెల్యేకు రూ. 150 కోట్లు, మంత్రి పదవితో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన యడ్యూరప్ప ఆడియో టేపు.. కన్నడ రాజకీయాల్లో పెను సంచలనం అయ్యాయి. ఆ టేపులు తనవి కాదని… నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని… వాటిని బయటపెట్టిన రోజున..యడ్యూరప్ప మీడియా ముందు సవాల్ చేశారు. అయితే.. వాటిని ఎక్కడ నిరూపిస్తారోనని భయపడ్డారో కానీ.. ఆయన ఆ మాటలు తనవేనని.. ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టినట్లు అంగీకరించారు. అయితే కుమారస్వామే ఆ ఎమ్మెల్యేను తన వద్దకు పంపి.. మాట్లాడించారని.. ఆరోపించి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తానే ఎమ్మెల్యేను ప్రలోభపెట్టినట్లు .. యడ్యూరప్ప నేరుగా అంగీకరిచడంతో… కర్ణాటకలో రాజకీయ దుమారం రేగుతోంది.
యడ్యూరప్ప ఇలా స్వయంగా తానే ప్రలోభాలకు పాల్పడినట్లు అంగీకరించిన వెంటనే.. కాంగ్రెస్, జేడీఎస్ ఆయనపై తీవ్రమైన నిరసన ఆగ్రహం వ్యక్తం చేశాయి. కుమారస్వామిని సినిమా నిర్మాతగా పేర్కొంటూ.. అలాంటి రికార్డింగులు ఆయన చాలా చేయించగలరంటూ.. ఆరోపించి… ఇప్పుడు అంగీకరించడం బీజేపీ సెల్ఫ్ గోల్‌గా మారింది. ఆయన రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రలోభాలు… ఇప్పటి నుంచి కాదు.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. కర్ణాటక ఎమ్మెల్యేలకు నేరుగా ప్రలోభాలు పెట్టిన వారిలో ప్రకాష్ జవదేకర్, మురళీధర్ రావు కూడా ఉన్నారు. వారి ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి.
సాధారణంగా.. ఇలా.. ఎవరో ఫోన్లో.. ఎమ్మెల్యేనో.. ఎమ్మెల్సీనో ప్రలోభ పెట్టినట్లు తేలితే.. వెంటనే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి. అయితే..ఈ దర్యాప్తు సంస్థలు.. బీజేపీ వాళ్లు అలాంటి నేరాలు చేస్తే పట్టించుకోవు. కానీ.. బీజేపీయేతర పార్టీల నేతలు ఎవరైనా చేస్తే.. మాత్రం వెంటనే దిగిపోతాయి. యడ్యూరప్ప .. ఎమ్మెల్యేకు ఇస్తానన్న రూ. 150 కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారన్న వివరాల కోసం.. ఐటీ, ఈడీ రంగంలోకి దిగిపోతాయి. వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం… ప్రత్యర్థుల్ని జైలుకు పంపించడానికి కూడా ఉపయోగించుకుంటారు. కానీ.. కర్ణాటకలో బీజేపీ నేతలు కదా.. వారికి చట్టం.. చుట్టమే. అందుకే ఏమీ కాదు..!