ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా ఓ వాలంటీర్.. తన పరిధిలో ఉన్న వారికి పించన్లను పంపిణీ చేశాడు. కానీ అవన్నీ దొంగ నోట్లుగా తేలవడం సంచలనం సృష్టిస్తోంది. అది కూడా మరుమూల గ్రామంలో ఈ దొంగ నోట్ల ప్లాన్ అమలు చేయడంతో ఏదో గూడుపుఠాణీ ఉందన్న అనుమానాలు ప్రారంభమవుతున్నాయి.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సయపాలెం ఎస్సి పాలెంలో వాలంటీర్ ఉదయమే వచ్చి పెన్షన్లు ఇచ్చాడు. ఆ నగదును కొంత మంది తమ బంధువులకు పంపేందుకు కమిషన్ తీసుకుని డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే దుకాణం వద్దకు వెళ్లి.. ఆ నోట్లు ఇచ్చారు. అయితే వాటిని నకిలీ నోట్లుగా దుకాణం యజమాని గుర్తించారు. దీంతో పింఛన్ దారులు అవాక్కయ్యారు. వెంటనే వాలంటీర్ని నిలదీయడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకొని ఆ నగదును వెనిక్కి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం రూ.19 వేలు దొంగ నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు పాల్పడుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అసలు వారి చేతికి ప్రభుత్వ ధనం ఇవ్వడమే చట్ట విరుద్ధం. అయినప్పటికీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కొనసాగిస్తోంది. ఇప్పుడు వాలంటీర్లు అసలు నోట్ల స్థానంలో దొంగ నోట్లను పంపిణీ చేస్తున్నారు. ఎన్ని చోట్ల ఇలా జరుగుతుందో.. కానీ .. మొత్తానికి ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. అధికారులు పైపై విచారణ జరిపి ఆపేస్తే.. పెద్ద స్కాం బయటకు రాకుండా ఉంటుంది. సీరియస్ గా విచారిస్తేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే దొంగనోట్లు అనేది చిన్న విషయం కాదు.