ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతం తాడేపల్లిలో ఓ వార్డు వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదీకూడా తన చావుకు వలంటీర్ వ్యవస్థే కారమణమని, పని ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వాలంటీర్ బీటెక్ చదువుకున్నాడు. ఐదు వేలకు వాలంటీర్‌గా చేరాడు. కానీ ఇరవై నాలుగు గంటలూ పని చేసేలా అధికారులు పనులు చెబుతూండటం.. అవి చేయలేకపోవడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సూసైడ్ నోట్లో సంతకంలేదని పోలీసులు చెుతున్నారు.
ఆస్టులోనూ అనంతపురంలో ఓ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నారు. “నా చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ ఉద్యోగం… ” అని లేఖ రాసిపెట్టి మరీ అనంతపురం జిల్లా రాయదుర్గం అనే వార్డు వాలంటీర్ మహేష్ ఆత్మహత్య చేసుకున్నారు. తమతో బండ చాకిరీ చేయిస్తున్నారనీ అయినా ప్రయోజనం ఉండటం లేదని వారి వేదన. అన్ని రకాలుగా వాడుకుంటున్నారనీ గ్రామ, వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్నవారు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు అధికారులు, మరోవైపు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.
వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ప్రజలకు ఎంత మేలు జరుగుతుదో కానీ వాటి వల్ల అనేక సమస్యలు మాత్రం ప్రభుత్వానికి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వాలంటీర్లు చేస్తున్న నేరాలు హైలెట్ అవుతున్నాయి. మద్యం స్మగ్లింగ్ దగ్గర్నుంచి ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడటం వరకూ చాలా కేసులు వాలంటీర్లపై నమోదు అయ్యాయి. అదే సమయంలో పెన్షన్లకు చెల్లించాల్సిన డబ్బులు తీసుకుని పారిపోవడం వంటివి తరచూ జరుగుతున్నాయి. ఇవన్నీ వారు చేస్తున్న ఘనకార్యాలే అనుకుంటే.. వారు కూడా ఈ వ్యవస్థ పట్ల అంత సంతృప్తి లేరని.. కష్టపడి పని చేసే వాలంటీర్లు నిరాశా నిస్పృహలకు గురవుతున్నారని తరచూ చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలు నిరూపిస్తున్నాయి.