వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని.. వారికి ఇచ్చేది జీతం కాదని గౌరవ వేతనం అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ సారి వాలంటీర్లు జీతం పెంపు కోసం ధర్నాలు చేసినప్పుడు బహిరంగ లేఖ రాశారు. కానీ ఉద్యోగాలు ఇచ్చిన జాబితా ప్రకటించాలంటే.. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగానే చెబుతూంటారు. ఉద్యోగులైతే.. రూ. ఐదువేలకు పని చేయించుకుంటారా అనే ప్రశ్నలు వచ్చినా అవి ఏపీలో పని చేయవు. అవసరమైనప్పుడు వారిని ఉద్యోగులుగా… సేవకులుగా చెప్పుకోడం పరిపాటిగా మారింది.
అయితే వారిని ఈ సారి త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించబోతున్నామని స్పీకర్ హోదాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ప్రకటించారు. తాను స్పీకర్ నే అయినా వైసీపీ కార్యకర్తనని ఆయన చెబుతూ ఉంటారు. ఈ పద్దతిలో ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రకటన చేశారు. టీడీపీ వస్తే వాలంటీర్లను తీసేస్తారని అంటున్నారని.. ప్రభుత్వం త్వరలోనే వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తుందని చెప్పుకొచ్చారు. ఎలా ఉద్యోగులుగా ప్రకటిస్తుందో తెలియదు కానీ.. తమ్మినేని సీతారాం ప్రకటన మాత్రం వాలంటీర్లలో కొత్త ఆశలు రేపుతోంది.
ఇదే కార్యక్రమంలో తమ్మినేని సీతారాం తొడకొట్టారు. గతంలో మహానాడు వేదికపై నుంచి కావలి గ్రీష్మ తొడ కొట్టిన అంశం సిక్కోలు జిల్లా వైసీపీనేతలకు ఇంకా గుర్తుంది. రోజూ గుర్తొస్తున్నట్లుగానే ఉంది. అందుకే అదే విషయాన్ని గుర్తు చేసుకుని.. ఆమె తొడకొట్టిన విధానాన్ని అనుకరిస్తూ.. స్పీకర్ కూడా తొడగొట్టేశారు. చంద్రబాబుపై ఎప్పట్లాగే తిట్ల పురాణం వినిపించారు.