వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి..మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ప్రజల్ని జగన్‌పై తిరగబడాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం ప్రజలు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ కేబినెట్ లో కమ్మ వర్గానికి చెందిన మంత్రి లేకపోవటం ఏంటనేది ఆయన ప్రశ్న. ఏపీలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి పేర్లతో చాలా ఉన్నాయని..కానీ ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చలేదన్నారు.
రాష్ట్రంలో కమ్మ వర్గం పైన రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్దం కావటం లేదని అంటున్నారు. ఏపీలో కంటే పక్క రాష్ట్ర అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉందని తెలంగాణ గురించి చెప్పుకొచ్చారు. ఈ కుల వ్యాఖ్యలు చేసింది.. నవభోజనాల్లో. ఇన్ని మాటలు చెప్పిన వసంత నాగేశ్వరరావు కానీ.. ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కానీ ఎప్పుడూ .. జగన్ ను ప్రశ్నించలేదు. ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. వారు మాత్రం రాజకీయంగా జగన్ దగ్గర ఉంటూ.. కులం కార్డు వాడుతూ రాజకీయ ప్రయోజనాలు పొందుతారు.. ఇతరుల్ని మాత్రం నిందిస్తూ ఉంటారు.
కులాలను రాజకీయంగా వాడుకోవడంలో వైసీపీ నేతలను మించిన వారు లేరు. ఈ వన భోజనాల సీజన్లో పిలవని పేరంటాల్లా ప్రతీ వన భోజనానికి వెళ్లడం జగన్ భజన చేయడం కామన్ అయిపోయింది. దాదాపుగా అన్ని సామాజికవర్గ వన భోజనాల్లోనూ జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కమ్మ సామాజికవర్గ వన భోజనాల్లో అయితే జగన్ పొగిడితే తేడా వస్తందని.. వసంత నాగేశ్వరరావు లాంటి తెలివిగా..ఆయనపై ఎందుకు తిరగబడటం లేదోనని ఆవేదన వ్యక్తం చేసి వస్తున్నారు. మరి రాజకీయం అంటే అదే.