మత రాజకీయాలు ఇవాళ కాకపోతే.. రేపైనా రాష్ట్రానికి, దేశానికి చేటు తెస్తాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగినప్పుడల్లా.. రాజమండ్రిలో ప్రెస్మీట్ పెట్టి..తన వాదనలు వినిపించే ఆయన.. ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్న మత రాజకీయాలపైనా అంతే స్పందించారు. రామతీర్థం ఘటన విషయంలో ప్రభుత్వం సీరియస్గా పోలీసులకు అప్పచెబితే.. ఒక్క రోజులోనే నిందితుల్ని బయట పెడతాని తేల్చేశారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభఉత్వం స్వేచ్చ ఇవ్వడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాదు.. చంద్రబాబు పర్యటన పెట్టుకున్న రోజు ముందుగానే… విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్లారో తనకు అర్థం కావడం లేదని అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.
ఆలయాల్లో విధ్వంసాలకు పాల్పడేవాళ్లు రాజకీయ నేతలు కాదని.. సంఘ విద్రోహ శక్తులని స్పష్టం చేశారు. అలాంటి వారికి ఎలాంటి పార్టీ ఉండదని.. పట్టుకుని శిక్షిస్తే.. మళ్లీ మళ్లీ జరగకుండా ఉంటాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి పనులు భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి ముప్పుగా పరిణమించే పరిస్థితులు నెలకొంటాయన్నారు. భగవద్గీత, బైబిల్ పేర్లను ప్రస్తావించి తిరుపతిలో ఎన్నికల ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు. హిందూత్వాన్ని నమ్మేవారు.. ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తారన్నారు.
ఈ సందర్భంగా మత మార్పిడులపైనా ఉండవల్లి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం వద్ద జరిగిన సభలో చంద్రబాబు మత మార్పిడుల ప్రస్తావన చేయడాన్ని తప్పు పట్టారు. బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారని చంద్రబాబు అక్కడ వ్యాఖ్యానించారు. దీనిపై ఉండవల్లి వివరంగా విశ్లేషించారు. బలవంతంగా మత మార్పిడులు ఉండబోవన్నారు. ఏపీలో ఉన్న అంటరాని పరిస్థితుల వల్ల.. కొన్ని వర్గాల వారిని గుళ్లలోకి రానీయలేదని.. వారిని చర్చిలు లోపలికి తీసుకెళ్లి కుర్చీలు వేసి కూర్చోబెట్టాయని అందుకే మత మార్పిళ్లు జరిగాయన్నారు. తన కులం కూడా అంటరాని తనం పాటించడంపై ఆయన సిగ్గుపడుతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు.
అదే సమయంలో మత మార్పిళ్లు… భారత్ – పాకిస్థాన్లు విడిపోవడానికి కారణమని కూడా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. పాకిస్తాన్ జాతిపితగా ఉన్న మహ్మద్ అలీ జిన్నా… వాస్తవానికి హిందూ అని ఉండవల్లి చెబుతున్నారు. పైగా ఆయనది రాముడి వంశంగా తేల్చారు. జిన్నా తాత రాజ్పుత్ వంశానికి చెందిన వారు. వారు పూర్తి శాఖాహారులు. అయితే ఆయన చేపల వ్యాపారం చేశారు. దీనిపై కుల పెద్దలు ఆగ్రహించి ఆయనను.. కులబహిష్కరణ చేశారట. దీంతో తన తాత దుస్థితిని చూసిన జిన్నా ఇస్లాంలోకి వెళ్లిపోయారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. అలా మతం మారి భారత్, పాకిస్థాన్ విడిపోవడానికి కారకుడయ్యారన్నారు.
మత మార్పిడుల విషయంలో ఉండవల్లి.. ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి పోలేదు. మత రాజకీయాలు చేస్తే.. తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు లభిస్తాయేమో కానీ దీర్ఘకాలంలో అందరికీ చేటు చేస్తాయన్న విషయాన్ని మాత్రం.. స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.