హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ఇప్పుడు వెనక్కు తగ్గితే చరిత్ర క్షమించదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోడి-చంద్రబాబు భేటి తీవ్రఅసంతృప్తిని మిగిల్చిందని అన్నారు. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారు…ఏం పాపం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏదో మంచి వార్తతో వస్తారనుకుంటే తలదించుకుని వచ్చారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుకంటే ఇది ఇంకా అవమానమని చెప్పారు. విభజన చట్టంలోని హామీల అమలుకు రోడ్ మ్యాప్ ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అన్నారు. మోడికి నచ్చితే ఏమైనా చేస్తారని, మరి మోడికి చంద్రబాబు నచ్చటంలేదా అని అడిగారు. రాష్ట్రాన్ని అంతా కలిసి పాతాళంలోకి తొక్కేస్తున్నారని ఆరోపించారు. 15వేలకోట్ల రెవెన్యూలోటుకుగానూ 2500 కోట్లు మాత్రమే ఇస్తారా అని అడిగారు. ప్రణాళికా సంఘం చెప్పింది వేదం కాదు సలహా మాత్రమేనని అన్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడెందుకు వెనక్కు తగ్గుతున్నారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాను ప్రకటించకుండా, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, మగపెళ్ళివారు – పెళ్ళి అచ్చిరాదు, అమ్మాయిని కాపురానికి పంపండి, పెళ్ళి అయితే ఏమి సౌకర్యాలుంటాయో అన్నీ ఇస్తామని అలానే చూసుకుంటామని అంటే చెప్పు తీసుకుని కొడతారని చెప్పారు. ఇప్పుడు ఇస్తామంటున్న ప్యాకేజికూడా అలాంటిదేనని అన్నారు.