తెలంగాణ తెలుగుదేశం పార్టీలో గొడవ ముదిరింది. అధినేత దూరంగా ఉండడంతో ఈ యాక్ష్న్ సినిమా రీళ్లు ఏ రోజుకా రోజు మరిన్ని పెరుగుతున్నాయే తప్ప క్లైమాక్స్ కనపడడం లేదు. నిన్నటిదాకా టీటీడీపీ నేతలు రేవంత్‌ని పార్టీ నుంచి తొలగించనున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ రోజు ఏమైందో ఏమోగాని చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడానంటున్న పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ… రేవంత్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తున్నామని, అయితే ఆయన తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పాడు. గురువారం జరగనున్న తెదేపా-భాజాపా సమన్వయ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేగా రేవంత్‌ను ఆహ్వానిస్తామన్నాడు.
మరోవైపు రానున్న అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తాను టీటీడీపీ -భాజాపా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్‌రెడ్డి ప్రకటించాడు. అంటే… అధ్యక్షుని సూచనల్ని బేఖాతరు చేస్తున్నానని స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబు వచ్చేదాక ఆయన్ను కలిసేవరకూ తానెవరినీ ఈ విషయంపై కలవబోనని, మాట్లాడబోనని పునరుధ్ఘాటించాడు రేవంత్. దీనిపై మండిపడిన ఎల్.రమణ… వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎటువంటి సమావేశాలూ ఏర్పాటు చేయవద్దంటూ రేవంత్‌ని హెచ్చరించాడు. అలా ఏర్పాటు చేసే నైతిక అర్హత రేవంత్ కోల్పోయాడన్నాడు. మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…తాను రేవంత్ తో కలిసి వెళ్లడం లేదని చెప్పేశాడు. టీటీడీపీ ఏర్పాటు చేసే సమావేశానికి హాజరవుతానని స్పష్టం చేశాడు.
ఇప్పటివరకూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ రేవంత్‌ను బహిరంగంగా విమర్శిస్తున్నారే తప్ప ఒక్క షోకాజ్ నోటీస్ కూడా తనకి పంపకపోవడం గమనార్హం కాగా… పదవి నుంచి తొలగించినట్టు కూడా అధికారికంగా ఆయనకు ఎటువంటి సమాచారం అందించకపోవడం విశేషం. కాంగ్రెస్ నేతల్ని కలిసి పార్టీలో చేరే విషయంపై చర్చించడం మాత్రమే కాకుండా ఎపి కి చెందిన పలువురు స్వంత పార్టీ మంత్రులపై ఆరోపణలు గుప్పించి, పార్టీ పరువు తీశాడంటూ తిట్టిపోస్తున్నారే తప్ప… రేవంత్‌కి కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారనేది అంతుపట్టడం లేదు. ఏ రాజకీయపార్టీలోనూ జరగని విచిత్రాలకు నిలయంగా మారిన తెలంగాణ తెలుగుదేశం జరుపనున్న సమన్వయ సమావేశం మరిన్ని విచిత్రాలను మనకు పరిచయం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.