తెలుగుదేశంలో ప్రముఖుల మధ్య అంతర్గత కుమ్ములాటలు మళ్లీ బయటపడుతున్నాయి! విశాఖలో భూదందాకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ జిల్లా రాజకీయం మరోసారి కాకపుట్టిస్తోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడి మధ్య విభేదాలు ఎప్పట్నుంచో ఉన్నవనే సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భూదందా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి అయ్యన్న పాత్రుడిపై గంటా శ్రీనివాసరావు మరోసారి ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ దందాలో గంటా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించింది. ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్వాపరాలను ఆ జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటా లేఖ చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై పొగడ్తలు గుప్పిస్తూనే ఈ లేఖలో కొన్ని అంశాలను గంటా ప్రస్థావించారు. హుద్ హుద్ లాంటి ప్రకృతి విలయం తరువాత విశాఖను అన్ని విధాలుగా ఆదుకుని, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే స్థాయికి అభివృద్ధి చేశారంటూ సీఎంను కొనియాడారు. ఆ తరువాత, అయ్యన్నపై ఫిర్యాదులు మొదలుపెట్టారు. విశాఖ భూ ఆక్రమణల్లో పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్టుగా అయ్యన్న పాత్రుడు మీడియా ముందు చెప్పడాన్ని గంటా లేఖలో తీవ్రంగా తప్పుబట్టారు. మన పార్టీ నాయకులే కారకులు అని వేలెత్తి చూపడం ఏంటంటూ విమర్శించారు. అయ్యన్న చేసిన కామెంట్స్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయనీ, ప్రభుత్వ ప్రతిష్ఠతోపాటు విశాఖ నగర పరువును కూడా తీసుకున్నట్టే అవుతుందని గంటా లేఖలో వ్యాఖ్యానించారు. గతంలో కూడా విశాఖ ఉత్సవ్, సంక్రాంతి కానుకలు వంటి ప్రభుత్వ కార్యక్రమాలపైన అయ్యన్న ఇలాంటి వ్యాఖ్యలే చేసి పార్టీని ఇరకాటంలోకి నెట్టేసే స్థితిని తీసుకొచ్చారన్నారు. ఆయన వ్యాఖ్యలు వల్లనే బొత్స, పురందేశ్వరి, రోజా వంటి వారు కూడా తెలుగుదేశం మీద దుమ్మెత్తి పోస్తున్నారనీ, దీంతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న శ్రమ వృథా అవుతోందని చంద్రబాబుకు రాసిన లేఖలో గంటా పేర్కొన్నారు. కాబట్టి, ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జ్, సీబీసీఐడీ, జుడిషియల్ విచారణను జరిపించాలని గంటా కోరారు.
మొత్తానికి, విశాఖ భూదందా వ్యవహారం తెలుగుదేశంలో నివురుగప్పి ఉన్న విభేదాలను మళ్లీ రాజేసినట్టే అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనే స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం, అయ్యన్న వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పడం విశేషం! మరి, ఈ ఇద్దరి నేతల మధ్య మరోసారి ప్రారంభమైన ఈ తాజా ఆధిపత్య పోరును చంద్రబాబు ఎలా తీర్చుతారో వేచి చూడాలి. నిజానికి, విశాఖ భూదందాలో సొంత పార్టీ నేతలు ఎవరైనా ఉన్నారా అంటూ సీఎం ఆరా తీసినట్టు కూడా కథనాలు వచ్చాయి. ఓపక్క శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడి కొత్త సమస్యగా మారితే… దానికి తోడు మంత్రుల మధ్య వార్ తెరమీదికి రావడం చంద్రబాబుకు కొత్త తలనొప్పే.