కథ రాయడం అంత ఈజీ ఏం కాదు. సాహితీ ప్రక్రియలోనే కష్టమైన విషయం. ఎందుకంటే రెండు మూడు పేజీల్లోనే చెప్పాలనుకొన్న విషయాన్ని సూటిగా, అర్థమయ్యేలా చెప్పగలగాలి. వందల, వేల, లక్షల కథల్లో ప్రత్యేకంగా నిలవాలంటే కథలోనో, కథనంలోనో, ఎంచుకొనే విషయంలోనో ఏదో ఓ కొత్తదనం వెదుక్కోవాలి. అలా వెదుక్కొంటూ, కథని రక్తికట్టేలా రాయగలగడం ఓ ఆర్ట్. కథా రచన తగ్గిపోతున్న తరుణంలో, కొత్త పాఠకుల్ని అన్వేషించాల్సిన పరిస్థితుల్లో కథలు రాస్తున్న వాళ్లని ప్రోత్సహించడానికి, కొత్త కథల్ని పాఠకులకు పరిచయం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ‘కథా కమామిషు’. ఈవారం (ఆగస్టు 6) వివిధ పత్రికల్లో వచ్చిన కథల్ని ఇప్పుడు మీకు క్లుప్తంగా పరిచయం చేస్తున్నాం.
కథ: నేను చాలా మంచోడ్ని!
రచన: ఎ.రవీంద్రబాబు
పత్రిక: ఆంధ్రజ్యోతి
నేను చాలా మంచోడ్ని అని మొదలుపెట్టిన కథ ‘అసలు ఈలోకంలో మంచివాళ్లంటూ ఉన్నారా?’ అనే ప్రశ్నతో ముగిసింది. దాన్ని బట్టి కథెలా సాగిందో అర్థం చేసుకోవొచ్చు. చాలామంది మంచితనం ముసుగు వేసుకొని బతికేస్తుంటారు. ఆ ముసుగు తీస్తే అంతా ఒకటే. అన్నీ పైపైన మెరుగులే. మనిషిలోని స్వార్థాన్నీ, కల్మషాన్నీ వేలెత్తి చూపించే కథ ఇది. అలాగని సూక్తులు, సుత్తి కొట్టడాలూ లేవు. నేరేషన్ చాలా సింపుల్ గా సాగిపోయింది. రిషి అనే పాత్ర, తను పైకి ప్రవర్తించే తీరు, లోలోపల తన వక్ర బుద్ది.. ఇవన్నీ చిన్ని చిన్ని పదాల్లోనే చెప్పేశాడు రచయిత. చిన్న కథే. దాంతో కథ సడన్ గా ముగిసిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది.
కథ: వేపపళ్లు
రచన: హనీఫ్
పత్రిక: సాక్షి
ఓ కొడుకు తన హక్కు కోసం పడిన ఆరాటం ఈ కథ. టైటిల్ లానే వగరుగా, చేదుగా ఉండే నిజాలు కొందరి జీవితాల్లో అప్పుడప్పుడూ ఎదురు పడుతుంటాయి. శేషు కి తన తండ్రి ఎదురు పడినట్టు. శేషులోని ఆవేశం, ఆవేదన ఈ కథ. మాదిగ గూడెన్ని అక్షరాల్లో వర్ణించిన తీరు బాగుంది. ఆ తరవాత ఓ చావు, దాని వెనుక ఉన్న కారణం ఇవన్నీ ఆసక్తి కలిగిస్తాయి. ముగింపు చక్కగా ఉంది. కొంతమంది స్త్రీలు పైకి చాలా సామాన్యంగా కనిపిస్తారు. కానీ అవసరమైనప్పుడు వాళ్లలోని మనో నిబ్బరం, ధైర్యం బయట పడతాయి. ఈ కథలో ఓ పాత్రలా. కథలో ఫ్లో బాగుంది. మాండలికంలో ఈ కథని ఎత్తుకొని, మధ్యలోనే వదిలేసినట్టు అనిపిస్తుంది. కథంతా ఒకే కలర్ లో కనిపించాలంటే.. ఆ ప్రవాహం ఒకేలా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.
కథ: గండికోట పతనం
రచన: తెన్నేటి శ్యామకృష్ణ
పత్రిక: నమస్తే తెలంగాణ
చరిత్రని కథల్లోకి తీసుకొచ్చి రికార్డు చేయడం చాలా అత్యవసరం. అలాగైనా మన చరిత్ర బతికి ఉంటుంది. ఆ ప్రయత్నమే చేశారు తెన్నేటి శ్యామకృష్ణ. ‘గండికోట పతనం’ కథ కాదు. చరిత్ర. దాన్ని ఓ అందమైన కథగా రాశారు. కథంతా యుద్ధమే. ఆ వాతావరణం కళ్లకు కట్టినట్టు చెప్పారు. చారిత్రక నేపథ్యం ఉన్న కథలు రాసేటప్పుడు ఎలాంటి టెక్నిక్ ఉపయోగించాలో బాగా అర్థం చేసుకొని ఈ కథ రాసినట్టు అనిపించింది. చరిత్ర అంటే భయపడేవాళ్లకి కూడా అందంగా, అర్థమయ్యేలా, పూస గుచ్చినట్టు కథలా చెప్పుకొచ్చారు. అక్కడి వాతావరణాన్ని, ఆ కాలాన్ని కళ్లముందుకు తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. చరిత్ర పాఠాన్ని ఓ కథగా మలచినందుకు రచయిత అభినందనీయుడు.
కథ: నమ్మకం – ప్రేమ
రచన: కె.వి.నరేందర్
పత్రిక: వెలుగు
విశ్వాసానికి మారు పేరు కుక్క. ఓసారి చేరదీసి, కాస్త కడుపు నింపితే చాలు. ఆ విశ్వాసాన్ని జీవితాంతం చూపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలొచ్చాయి. ఎన్నో కథలు రాశారు. వాటిలో ఇదొకటి. ధర్మరాజు అనే పెద్దాయన బండి మీద పోతుంటే, చిన్న కుక్కపిల్ల అడ్డమొస్తుంది. గాయపడ్డ కుక్కని ఇంటికి తీసుకొచ్చి, సపర్యలు చేసి, టామీ అని పేరు పెట్టుకొని పెంచుకొంటాడు. కాలక్రమంలో ధర్మరాజు చనిపోతాడు. అంత్యక్రియలు చేయడానికి పిల్లలు కూడా రారు. కానీ టామీ మాత్రం ధర్మరాజు రాక కోసం మార్చురీ ముందే పడిగాపులు కాస్తుంది. ఈ వైనాన్ని హృద్యంగా రాసుకొచ్చారు రచయిత. ఇలాంటి కథలు చాలాసార్లు చదివాం కాబట్టి, కొత్తగా అనిపించకపోవొచ్చు. కానీ మూగ జీవాల ప్రేమ, వాటి విశ్వాసం ముందు మనిషి ఎందుకూ పనికిరాడు అనే కఠోర నిజాన్ని మరోసారి ఈ కథతో తెలుసుకొనే అవకాశం దక్కింది.
– అన్వర్