సాహితీ ప్రక్రియలో కవిత్వం కంటే, నవలలు కంటే.. కథలే విరివిగా వస్తున్నాయి. కాకపోతే అలాంటి కథల్లో నిలబడగలిగేవి ఎన్ని? అనేదే ప్రశ్న. రాస్తున్నారు సరే, చదివేవాళ్లు ఉన్నారా, రాసిన వాళ్లకు గుర్తింపు దక్కుతుందా? మళ్లీ రాయాలన్న కుతూహలం కలుగుతోందా? రాసిన కథలకు జల్లెడ పట్టి, మంచివాటిని పాఠకులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. అందుకే… తెలుగు సాహితీ లోకానికి కొత్త కథల్ని పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలుగు 360… `కథాకమామిషు` శీర్షిక ప్రారంభించింది. వారం వారం ప్రధాన దిన పత్రికలలో వస్తున్న కథల గురించి టూకీగా పరిచయం చేస్తోంది. మరి ఈవారం (జులై 21) కథలెలా ఉన్నాయి? అందులో చదవదగినవి ఎన్ని?
కథ: గ్రంథాలయం వీధి
రచన: ఎం.వెంకటేశ్వరరావు
పత్రిక: ఈనాడు
ఇల్లంటే… నాలుగ్గోడలు, పైకప్పు, అందులో ఉన్న ఫర్నీచర్ మాత్రమే కాదు. అదో అనుబంధాల నిలయం. తండ్రి కష్టం. తల్లి లాలన. అన్నదమ్ముల అనుబంధం. ఇదంతా వారసత్వంగా మరో తరానికి అందివ్వాలి కానీ, అమ్ముకోకూడదని చెప్పిన అందమైన కథ… ‘గంథాలయం వీధి’. అమ్మ చనిపోయాక, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. ఇంటిని అమ్మాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ఎమోషనల్ గా వాళ్ల మనసులు ఎలా కదిలాయి? ఇల్లు అనగానే ఏం గుర్తొచ్చాయి? చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారన్నదే కథ. ఇల్లు – సొంతూరు ఎప్పటికీ ఎమోషన్ మూమెంట్సే. అవన్నీ ఈ కథ చదువుతున్నప్పుడు పాఠకుల కళ్ల ముందు మరోసారి కదలాడతాయి.
కథ: ఓరామం కథ
రచన: యల్లపు పావని
పత్రిక: సాక్షి
కొన్ని కథల్లో సినిమాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అది తప్పని చెప్పలేం. అది కూడా ఓ స్టైల్ అనుకోవాలంతే. కానీ కథ పోకడ వేరు. కథ చదువుతున్నప్పుడు ఇది వరకెప్పుడో చూసిన సినిమా ఏదో గుర్తొస్తే – ఆ రచయిత, లేదా రచయిత్రిపై సినిమాల తాలుకూ ప్రభావం అనుకోవాలి. ‘ఓ రామం కథ’ చదవుతున్నప్పుడు అదే అనిపిస్తుంది. సినిమాటిక్ లిబర్టీ.. ఆ స్టైల్ ఈ కథలో ఉంది. ఓ అమర ప్రేమ కథని సినిమాగా చూస్తున్న వర్ణన ఈ శైలిలో కనిపించింది. సీతాలు, రామం మధ్య సన్నివేశాల్ని, వాళ్ల సంభాషణల్ని రచయిత్రి హృద్యంగా రాసుకొన్నారు. కానీ సంఘర్షణ, ముగింపు సినిమాటిక్ స్టైల్ లో ఉన్నాయి. ఓసారి చదవొచ్చు. కథకు ఆర్టిస్ట్ అన్వర్ వేసిన బొమ్మలు ఇంకా బాగున్నాయి.
కథ: పేకాట లోకం
రచన: దాట్ల దేవదానం రాజు
పత్రిక: ఆంధ్రజ్యోతి
చతుర్ముఖ పారాయణం (పేకాట)పై కథ రాయాలని ఈ రచయితకు ఎలా అనిపించిందో..? ఇస్మేటు, ఆర్టీను, కలావర్… అంటూ ఒక్కసారిగా పేకాట లోకంలోకి తీసుకెళ్లిపోయాడు. నిండా పేకాటలో మునిగిపోయి, నిత్యం అదే లోకంగా బతుకీడుస్తున్నవాళ్లు మన చుట్టూ చాలా మందే ఉంటారు. వాళ్లే ఈ కథలో హీరోలు. పేకాట ఆడే విధంబెట్టిదనన.. అని ఎవరికైనా తెలుసుకోవాలనుకొంటే ఈ కథ చదవొచ్చు. ఆల్రెడీ పేకాటతో పరిచయం ఉన్నవాళ్లు ఈ కథని చదువుతూ ఎంజాయ్ చేస్తారు. పరిచయం లేనివాళ్లు ‘వీడో మాలోకం’ అనుకోవొచ్చు. పేకాట కోసం ఓ చోట వర్ణిస్తూ ‘అగాధమైన గుప్త నిధి కోసం దేవుళ్లాడడమే’ అంటూ ఛలోక్తి విసిరాడు ఓచోట. కొన్ని ఉపమానాలు బాగున్నాయి. బహుశా.. పేకాటలో రచయితదీ చేయి తిరిగిన హ్యాండు అనుకొంటా.
కథ: ఫెటిసైడ్
రచన: ఎనుగంటి వేణుగోపాల్
పత్రిక: నమస్తే తెలంగాణ
డబ్బుల కోసం కక్కుర్తి పడుతూ బ్రూణ హత్యలకు పాల్పడుతున్న కొంతమంది వైద్యుల నిర్వాకం ఈ కథ. ప్రకృతికి మనం ఏమిస్తే.. మనకు అదే ఇస్తుందన్న సందేశాన్ని ఇచ్చింది. బ్రూణ హత్యలు, లింగ నిర్దారణ పరీక్షలు.. వీటిపై ఓ సామాజిక లఘు చిత్రం తీస్తే ఎలా ఉంటుందో ఈ కథ అలా ఉంది. సందేశాలు ఇవ్వడం మంచిదే. అయితే.. కేవలం సందేశాల కోసమే కథలు రాయాల్సిన అవసరం లేదు. ప్రతి కథలోనూ సందేశం ఉండాలన్న నిబంధన కూడా లేదు. హృదయాన్ని హత్తుకొనే ఎమోషన్, డ్రామా కథలో ఉండేలా జాగ్రత్త పడితే ఈ కథ ఇంకా రక్తి కట్టేది.
కథ: నా పేరు సియారా
రచన: మాండ్ర రమేష్
పత్రిక: వెలుగు
సియారా అనే పాపకు ఓరోజు బీచ్లో బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మ అంటే సియారాకు ఇష్టం ఏర్పతుంది. రోజూ తన సంగతులన్నీ పూస గుచ్చినట్టు చెబుతుంది. సడన్ గా ఓ రోజు బొమ్మ మాట్లాడడం మొదలెడుతుంది. ఆ తరవాత ఏం జరిగిందన్నదే ఈ కథ. కాన్సెప్ట్ ఓకే అనిపిస్తుంది. కథలో ఓ చిన్న ట్విస్టు కూడా ఉంది. కథనం, శిల్పం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. కథలు ఎక్కువ కాలం గుర్తుండిపోవాలంటే, చదివిన తరవాత ఓ అనుభూతికి లోనవ్వాలంటే కథనం, శిల్పం చాలా అవసరం. ఈ విషయాన్ని కొత్త కథకులు గుర్తుంచుకొంటే మంచిది.
– అన్వర్