బెంగాల్లో మరోసారి బీజేపీ వేట ప్రారంభమయింది. ఈ సారి ఓ రేంజ్‌లోనే ఇది సాగుతోంది. ఓ మంత్రిని అరెస్ట్ చేసి నేరుగా కోర్టులో హాజరు పరిచింది ఈడీ. ఇది అక్రమం అని.. కక్ష సాధింపు అని మమతా బెనర్జీ కూడా నిందించలేకపోతున్నారు. సొంత కేబినెట్ మంత్రిని అరెస్ట్ చేసినా ఆమె సైలెంట్‌గా ఉన్నారు. పార్థా ఛటర్జీ అనే ఆ మంత్రి సన్నిహితురాలైన సిన నటి, మోడల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిచాంచారు. ఈ సందర్భంగా 21 కోట్ల రూపాయల నగదు బయటపడింది. అన్నీ రెండు వేలు, ఐదు వందల నోట్ల కట్టలే.
ఈడీ అధికారులు ఆ సొమ్మును గుట్టుగా పోసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇదంతా టీచర్ల నియామకానికి సంబంధించిన ఓ స్కాం డబ్బులని ఈడీ చెబుతోంది. ఇటీవల బెంగాల్లో జరిగిన టీచర్ల నియామకాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. దీనిపై ఫిర్యాదు రావడంతోనే ఈడీ రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కోట్ల కొద్దీ నగదు స్వాధీనం చేసుకుంది. బెంగాల్లో అధికార పార్టీ టీఎంసీ అయినా… కేంద్రంలో బీజేపీ ఉంది.
బీజేపీతో మమతా బెనర్జీ ఢీ అంటే ఢీ అంటున్నారు. అక్కడ జెండా పాతాలన్న లక్ష్యంతో ఉన్నారు. అక్కడ జరిగే వ్యవహారాలపై పూర్తి సమాచారంతోనే బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి ముప్పు ఉంటుందని తెలిసి కూడా టీఎంసీ నేతలు ఇలా అవినీతికి పాల్పడి దొరికిపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా సమర్థించలేని విధంగా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి పార్థా ఛటర్జీ వ్యవహారాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక మమతా బెనర్జీ తంటాలు పడాల్సిన పరిస్థితి. ఈ సారి బీజేపీ అంత తేలికగా వదలదని.. పంజా గట్టిగానే విసురుతుందని భావిస్తున్నారు.