కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ళ బ్యారేజీలను సెంట్రల్ నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించింది. కాళేశ్వరం బ్యారేజీలు దెబ్బతినడానికి కారణాలు ఏంటని ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బుధవారం పూణే నుంచి వచ్చిన ఎక్స్ పర్ట్స్ టీం మొదట మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుంది. అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన వంతెనను పరిశీలించారు. అప్ స్ట్రీమ్ లో కిందికి దిగి ఏడో బ్లాక్ లలో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించి ఫోటోలను తీసుకున్నారు. అసలెందుకు పిల్లర్ కుంగిపోయిందని ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ లలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని నిపుణుల బృందానికి వివరించిన ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సుధాకర్ రెడ్డి వాటిని చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను వారి దృష్టికి తీసుకెళ్ళారు.
మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన అనంతరం అన్నారం బ్యారేజ్ ను పరిశీలించింది ఎక్స్ పర్ట్స్ టీమ్. అక్కడ ఉన్న 66పిల్లర్లను పరిశీలించి లోపాలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించింది. పిల్లర్లకు ఇంకా ఎక్కడైనా పగుళ్ళు వచ్చాయా..? వాటిని చక్కదిద్దేందుకు ఇదివరకే ఏమైనా చర్యలు చేపట్టారా..? అని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే,2020,2021లో పిల్లర్ల కింద లీకేజీలు ఏర్పడటంతో నిపుణుల సూచన మేరకు కెమికల్ గ్రౌటింగ్ చేసినట్లుగా తెలిపారు. అన్నారం బ్యారేజ్ లో మరమ్మత్తుల కోసం ఇంకా ఏమేమి చేయాలో నిపుణుల బృందం తెలుసుకుంది.