నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనది సహజంగానే కాస్త దూకుడు స్వభావం. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలు తీరు చూస్తే ఇట్టే ఎవరికైనా అర్థమైపోయింది. రామ జన్మభూమి వివాదాస్పద అంశంపైగానీ, సిటిజెన్ షిప్ అంశంపైగానీ ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడుతూ వచ్చారో గతంలో చూశాం. భాజపా జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన వ్యవహార శైలిని గమనించాక.. కేంద్ర హోంమంత్రిగా కూడా అదే తరహా దూకుడుతో వ్యవహరిస్తారా అనేది ఒక ప్రశ్న? తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అంశం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా హోంమంత్రిత్వ శాఖ మీద అంశాలు ఆధారపడి ఉన్నాయి. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీద ఉంది కదా! ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదు, దానికి బదులుగా ప్యాకేజీ ఇస్తామనీ ఇవ్వలేదు. విభజన చట్టంలోని అంశాల అమలుపై కూడా గడిచిన ఐదేళ్లపాటూ మోడీ సర్కారు ఎలాంటి వైఖరి అనుసరించిందో మనం చూశాం. ఆ చట్టం అమలు విషయంలో గత ప్రభుత్వంలో హోం మంత్రిత్వశాఖ వహించిన బాధ్యత ఏపాటిదో కూడా చూశాం. ఇప్పుడు, ఆ శాఖకు అమిత్ షా మంత్రిగా వచ్చారు!
అమిత్ షా విషయానికొస్తే… ఆయన ఆంధ్రాకి వచ్చిన ప్రతీసారీ, కేంద్రం చాలా ఇచ్చేసిందనే ప్రచారం చేశారు. కేంద్ర కేటాయింపులపై ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పేవారు. విభజన చట్టంలోని 85 శాతం అమలు జరిగిపోయిందనీ, మోడీ సర్కారు చాలానే చేసిందని ప్రచారం చేశారు. కేంద్రం చెప్పిన లెక్కల్లో వాస్తవాలేంటో ఏపీ ప్రజలకు తెలుసు. తూతూ మంత్రంగా కొన్ని విద్యా సంస్థలు, అక్కరకు రాని విశాఖ రైల్వే జోన్ మినహా… ఏపీకి జరిగిన మేలేమీ లేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ విషయంలో కూడా కేంద్రం నుంచి లక్షల కోట్లు ఇచ్చేశామనే ఆయన చెప్పారు. అమిత్ షా దృష్టిలో తెలుగు రాష్ట్రాలకు గత హయాంలోనే చాలా చేసేశామనే దృక్పథంతో ఉన్నారని స్పష్టమౌతోంది. ఇప్పుడు, ఏపీ విభజన చట్టంలోని అమలుకు నోచుకోని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారా అనేది అనుమానమే. ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగేలా హోం మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుందా అనేదే కొంత ప్రశ్నార్థంగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రంపై గతంలో మాదిరిగా ఒత్తిడి ఉండే అవకాశాలు ప్రస్తుతానికి లేవనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు!