వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ ఖాయమని ప్రకటనలు చేస్తూ వస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ..బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా ఉండరా అనే సందేహానికి కాస్త ముగింపునిచ్చారు. ఖమ్మంలో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగసభ కోసం నిర్వహిస్తున్న సన్నాహాక సమావేశాల్లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటున్నారు. కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఆయనంతటకు ఆయన వచ్చి సమావేశాలు నిర్వహించడం లేదు. ఆయనలో ఉన్న అసంతృప్తిని హరీష్ రావు చర్చల ద్వారా తగ్గించారు.
ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. తుమ్మల కూడా అదే దారిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ హరీష్ రావు ఖమ్మం సభ బాధ్యతలను తీసుకున్నారు. దీంతో ఆయన నేరుగా ఖమ్మం వచ్చి తుమ్మలతో సమావేశం అయ్యారు. ఇంత కాలం పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు. మంత్రిగా పువ్వాడ అజయ్ మొత్తం పెత్తనం చేసేవారు. కీలక సమావేశాలకూ తుమ్మలను ఆహ్వానించేవారు కాదు. దీంతో తుమ్మల బీఆర్ఎస్లో ఒంటరి అయ్యారు. దీంతో ఆయనకు పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం ఏర్పడింది.
అయితే హరీష్ రావు తుమ్మలతో చర్చలు జరిపి పార్టీలోనే చురుగ్గా ఉండే ఏర్పాట్లు చేశారు. పాలేరు నుంచి పోటీకి ఆయనకు హామీ ఇచ్చారని ఖమ్మం బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉన్నారు. పార్టీలో చేరినప్పుడే ఆయనకు టిక్కెట్ హామీ ఇచ్చారు. ఇప్పుడేం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పాలేరు టిక్కెట్ ఇవ్వకపోతే తుమ్మల అప్పటికప్పుడైనా ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారు. అందుకే హరీష్ రావు ఏం హామీ ఇచ్చి ఉంటారన్నది ఇప్పుడు ఖమ్మం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.