సినీ పరిశ్రమపై రేవంత్ బహిరంగ అసంతృప్తి కలకలం రేపింది. గద్దర్ అవార్డులు ఇస్తామంటే ముందుకు రావడం లేదనేది ఆయన బయటకు చెప్పిన కారణం. కానీ రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. ఈ ప్రకారం విశ్లేషిస్తే.. ఇండస్ట్రీ నుంచి రేవంత్ కోరుకుంటున్న సహకారం అందడం లేదని అందుకే రేవంత్ అసహనానికి గురయ్యారని అంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు… ఆ ప్రభుత్వం ఏం చేసినా పొగిడేందుకు ఓ టీమ్ రెడీగా ఉండేది. ట్వీట్ల మీద ట్వీట్లు వేసేవారు. ప్రభుత్వం మారిన తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. వారు గతంలో బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉన్నారు కదా అని రేవంత్ ప్రతీకారం ప్రారంభించలేదు. సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. భారీ సినిమాలు వస్తే ఎక్స్ ట్రా షోలు, టిక్కెట్ రేట్ల పెంపకం వంటి విషయాల్లో వారు అడినట్లుగానే ఉత్తర్వులు ఇస్తున్నారు. కనీసం తిప్పించుకోవడం లేదు .
Read Also :ఇండస్ట్రీపై రేవంత్ అసంతృప్తి – రంగంలోకి చిరంజీవి !
అయినా రేవంత్ ఆశించినంతగా సహకారం తెలంగాణ సర్కార్కు రావడం లేదు. రేవంత్ ఇండస్ట్రీ నుంచి తమ ప్రభుత్వానికి ప్రచారం కోరుకుంటున్నారని ఇటీవల ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. కొద్ది రోజుల క్రితం.. సినిమా ప్రారంభానికి ముందో తర్వాతో.. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సందేశం ఉండాలని రేవంత్ ప్రకటించారు . దీనిపై ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్పందించలేదు. ఇండస్ట్రీ మొత్తం ఈ అంశంపై ఓ తీర్మానం చేసి.. సీఎం నిర్ణయం ద్వారా… సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తామని సమైక్యంగా చెప్పలేకపోయారు. అదే కాదు.. ప్రభుత్వం చేస్తున్న మేళ్లకు స్పందించాలని ఆయన కోరుకుంటున్నారు. రైతు రుణమాఫీ సహా.. తాను చేస్తున్న పథకాలకు ఇండస్ట్రీ కూడా ప్రచారం చేయాలని ఆయన భావిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సినీ ఇండస్ట్రీపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. తర్వాత కేసుల భయంతో బీఆర్ఎస్ పెద్దలకు దగ్గరయ్యారు. అప్పట్నుంచి బీఆర్ఎస్ కు సపోర్టుగా ఉంటూనే వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ సహకరిస్తున్నా.. ఆ కోపరేషన్ చూపించడం లేదు. అందుకే రేవంత్ కాస్త అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నారు.