హైదరాబాద్: దేశవ్యాప్తంగా సినిమా అభిమానులందరూ చర్చించుకునేవిధంగా బాహుబలివంటి అపూర్వమైన చిత్రాన్నితీసి రాజమౌళి అందరి దృష్టీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌లో రికార్డులమీద రికార్డులు సృష్టిస్తున్న ఈ సమయంలో అసలు రాజమౌళి ఏమి చేస్తున్నారో అని అందరికీ ఒక ఆలోచన రావటం సహజం. నిన్నటితో బాహుబలికి మొదటివారం పూర్తవటంతో ఇవాళ్టినుంచి రాజమౌళి రిలాక్సవుతున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల హడావుడినుంచి కాస్త విరామం తీసుకుందామని అనుకున్నట్లున్నారు. కొద్దిరోజులపాటు సెలవులు తీసుకుంటానని, ఫ్యామిలీకి సమయం కేటాయిస్తానని ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌నుంచి తిరిగిరాగానే బాహుబలి ప్రభంజనంపై స్పందించి టీమ్‌కు అభినందనలు తెలిపిన మహేష్‌కు ట్విట్టర్ద్వారానే కృతజ్ఞతలు తెలిపారు.
బాహుబలి – 2 షూటింగ్ సెప్టెంబర్నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ పనులను ఆగస్టుకల్లా పూర్తిచేయాలని రాజమౌళి యోచిస్తున్నారు.