వర్మ వెకిలిగా నవ్వాడంటే చాలు.. దాని వెనుక వంద అర్థాలుంటాయి. తన మాటకే కాదు, చూపుకీ, నవ్వుకీ, నిట్టూర్పికీ ఓ భాష ఉంటుంది. ఓ అడుగు ముందుకు వేశాడంటే, ఆ పాదం కిందేదో బ్రహ్మపదార్థం ఉండి తీరాల్సిందే. తాను పబ్లిసిటీ పెంచుకోవడానికి, పబ్లిక్ ఫిగర్లని పబ్లిగ్గా వాడుకోవడంలో మొనగాడు వర్మ. ఈ విషయం ఈవాళ పూస గుచ్చినట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఇప్పుడు ఎన్టీఆర్‌పై పడ్డాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ బయోపిక్‌ని లక్ష్మీ పార్వతి కోణంలో తీస్తానని చెప్పి అందరినీ తన గురించి, తన సినిమా గురించీ మాట్లాడుకొనేలా చేశాడు. ఎన్టీఆర్ కథ ఎప్పటికీ గొప్ప కమర్షియల్ పాయింటే. స్వయంగా ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నా సరే… దానికి సమాంతరంగా తయారవుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌పైనా ఫ్యాన్స్ దృష్టి పెడతారన్నది వాస్తవం.
అయితే ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వర్మ స్ట్రాటజీ బొత్తిగా అంతుపట్టనంతగా తయారైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ అని టైటిలే.. విచిత్రంగా ఉంది. ఎన్టీఆర్ జీవితం లక్ష్మీ పార్వతితో మొదలైందా? అప్పటికి ఎన్టీఆర్ వైభవం చల్లారిపోతున్న స్థాయిలో ఉంది. సరే… అక్కడే వర్మకి కావల్సినంత డ్రామా, స్టఫ్ దొరికింది అనుకొందాం..?? లక్ష్మీ పార్వతీతో మాట్లాడకుండా ఈ కథని ఎలా తెరకెక్కిస్తాడు?? బయోపిక్‌లు తీస్తున్నప్పుడు సదరు వ్యక్తి బతికి ఉంటే.. పని సులభం అయిపోతుంది. లేదంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, కలసి పనిచేసిన వాళ్లు, ఆ వ్యక్తికి సమకాలికుల్ని కలుసుకొని తగినంత విస్తారంగా సమాచారాన్ని సేకరించుకోవాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టి.. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ కథ చెబుతూ, లక్ష్మీ పార్వతిని టచ్ చేయను అని చెప్పడం విడ్డూరంగా మారింది.
లక్ష్మీ పార్వతినే సంప్రదించని వ్యక్తి బాలకృష్ణని గానీ, హరికృష్ణని గానీ కలుస్తాడనుకోవడం అవివేకం. ఒకవేళ వర్మకు ఆ కోరిక ఉన్నా బాలయ్య దగ్గరకి రానిస్తాడనుకోవడం మన మూర్ఖత్వం. ”ఎన్టీఆర్ ఇంట్లో పనిచేసిన డ్రైవర్లను, వంటవాళ్లని అడిగి వివరాలు తెలుసుకొంటా” అని వర్మ తెలివిగా సమాధానం చెప్పి ఉండొచ్చు గాక… అసలైన ఎన్టీఆర్ అంటే ఏమిటో… వంట వాళ్లకు, పనివాళ్లకు తెలుస్తుందా? అర్థాంగిగానో, తనయుడిగానో హోదా దక్కించుకొన్న వాళ్లకు తెలుస్తుందా?? ”నేను తీసిందే సినిమా, చూపించిందే చరిత్ర” అనుకొని గుడ్డిగా అడుగులు వేస్తే మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వర్మ చేతులు, కాళ్లు, తల కాల్చుకోవడం ఖాయం. ఎందుకంటే ఎన్టీఆర్ ఓ వ్యక్తి కాదు.. జాతి గౌరవం. ఇలాంటి సున్నితమైన విషయాల్లో వర్మ తప్పు చేయడనే ఆశిద్దాం.