అంతన్నారు, ఇంతన్నారు.. కేంద్ర రాష్ట్రాల లెక్కల అంతు చూస్తామన్నారు..! మదింపులన్నారు, కుదింపులన్నారు.. తెగించి పోరాటమే తరువాయి అన్నారు..! అదేనండీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జె.ఎఫ్.సి. గురించే మాట్లాడుకోబోతున్నది. ఆంధ్రాకి చాలా ఇచ్చామని కేంద్రం అంటోందనీ, చాలా ఇవ్వాలని రాష్ట్రం డిమాండ్ చేస్తోందనీ… ఈ లెక్కలేంటో అర్థం కవాట్లేదనీ తేల్చేస్తానంటూ జె.ఎఫ్.సి. ఏర్పాటు చేశారు పవన్. జయప్రకాష్ నారాయణ, పద్మనాభయ్య వంటివారిని ఈ కమిటీలో సభ్యులుగా చేర్చారు. కేంద్ర రాష్ట్రాలు లెక్కలిస్తే పడిగడతామన్నారు. ఇంత ఉత్కంఠ పెంచిన పవన్ కమిటీ… చివరికి విడుదల చేసిన నివేదికలో వాస్తవాలున్నాయా..? గతంలో ప్రజలకు తెలియనవీ, కొత్తగా తేలిన లెక్కలేవైనా కనిపించాయా..? ఈ కమిటీ ఏర్పాటు ద్వారా పవన్ సాధించింది ఏంటీ, ఈ నివేదికతో సాధించాలనుకుంటున్నది ఏంటీ..? జె.ఎఫ్.సి. నివేదిక బయటకి వచ్చాక ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు చర్చనీయం అవుతున్నాయి.
పవన్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీకి కేవలం రాష్ట్రం మాత్రమే నిధుల కేటాయింపుల సమాచారం ఇచ్చింది. సమాచార హక్కు చట్టం ప్రకారం కేంద్రం నుంచి వివరాలు కోరామనీ, ఇప్పటివరకూ స్పందన రాలేదన్నారు. ఇక, జేపీ మాట్లాడుతూ… తమ దగ్గరున్న సమాచారం పరిగణనలోకి తీసుకుని లెక్కలు చూశాక, గతం కంటే కొంత స్పష్టత వచ్చిందన్నారు. మొత్తంగా కేంద్రం ఆంధ్రాకు ఇంకా ఇవ్వాల్సింది రూ. 74,542 కోట్లు అని చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… 11 కీలక అంశాలు కమిటీ దృష్టికి వచ్చాయన్నారు. వాటిలో సగం ఆయన చెబితే… మిగతా వాటి గురించి జేపీ మాట్లాడారు. గడువులోగా పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానికే ఉందనీ, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చేయాలనీ, ప్రత్యేక ప్యాకేజీ కింద ఏమీ ఇవ్వలేదనీ ఆ లెక్కా తేల్చాలనీ, రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని… ఇలా ఇంతవరకూ మనం వింటూ వస్తున్న డిమాండ్లనే మళ్లీ వినిపించారు.
ఇంతకీ, ఈ కమిటీ కొత్తగా కనిపెట్టిన వాస్తవాలు పెద్దగా కనిపించడం లేదు. కమిటీలో ఉన్నవారి అందరి అభిప్రాయాలనూ క్రోడీకరించి చెప్పినట్టుగానే ఉంది. దీన్ని ప్రధానమంత్రికి పంపించబోతున్నట్టు చెప్పారు. ఆ తరువాత, వీలైతే అఖిలపక్షం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తానని పవన్ అన్నారు. సో.. ఏతావాతా ఈ కమిటీ తేల్చిన లెక్కలేంటీ, ఫైండింగ్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటనేది స్పష్టత లేకుండా పోయిందనే చెప్పాలి. ఇంత సుదీర్ఘ కసరత్తు తరువాత జనసేనాని జనానికి ఇచ్చిన స్పష్టత ఏంటీ, ఇంతకీ ఆయన వచ్చిన స్పష్టత ఏంటనేది కూడా ప్రశ్నార్థకమే..!