అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. తమ విధానం మూడు రాజధాలను బొత్స సత్యనారాయణ చెబుతున్నప్పటికీ హైకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పట్టణాభివృద్ది మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏజీ శ్రీరాం ఈ సమావేశానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏజీ శ్రీరాం ప్రభుత్వానికి కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా ముందుకెళ్లాలా లేదా అన్నది చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే అమరావతి విషయంలో ఇకపై న్యాయపోరాటం చేసినా ఫలితం ఉండదన్న అభిప్రాయం వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువగా వినిపిస్తోంది. మూడు రాజధానులు చేద్దామనుకున్నా న్యాయస్థానాలు చేయనివ్వలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా పంపాలనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు.
లేకపోతే ఈ అంశాన్ని ఎన్నికల వరకూ లాక్కెళ్తే బెటరన్న చర్చ వైసీపీలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ అమరావతి విషయంలో ఏం చేయాలన్నదానిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. తీసుకున్నా బహిరంగంగా చెప్పరని.. మెల్లగా అమల్లో పెడతారని అంటున్నారు. ఇప్పటికే బొత్స సీఆర్డీఏ అమల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.