రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ పై చిలువలు పలువలు చేసేలా ఆరోపణలు చేయడం ఏంటనే చర్చ జరుగుతోంది.
రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులను రంగంలోకి దింపారు. కాంగ్రెస్ తీరు అనైతికం అంటూ…రాజకీయాలలో విలువలను దిగజార్చుతున్నారని బీజేపీ నేతలు మీడియా ఎదుట ప్రజాస్వామ్యంపై పాఠాలు చెప్పారు.ఇదంతా బాగానే ఉన్నా… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగారం లాక్కుంటుంది.. రెండు ఇళ్ళు ఉన్న వారి నుంచి ఒక ఇంటిని లాక్కుంటుందని బహిరంగంగా ఆరోపణలు చేయడం మాటేమిటనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అయితే…వేలాది మంది పాల్గొన్న బహిరంగ సభలో కాంగ్రెస్ పై అనైతిక ఆరోపణలు చేయడం నైతికత ఎలా అవుతుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్నీ బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తోన్న ఆదరణను ఓర్వలేకే రిజర్వేషన్ల అంశాన్ని ముందుంచి బీజేపీ – కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ లతో హోరెత్తిస్తున్నారు.