కేజీఎఫ్.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఈ పేరు ఇంతకు ముందు ఎవరైనా ..ఎప్పుడైనా విన్నారా?. ఎవరూ వినలేదు..కొత్తగా పుట్టుకు వచ్చిది. కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకునే కొంత మంది ఎన్నారై పెద్దలు.. వారికి ఇక్కడ సహకరించేందుకు సిద్ధంగా ఉన్న స్వయం ప్రకటిత కుల పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన వేదిక అది. పలుకుబడి ఉంది కదా అని.. ఓ కార్యక్రమం నిర్వహించేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పిలిపించి చేయించిన ప్రసంగాలు.. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అతి ప్రచారాలు మొత్తంగా నెగెటివిటీ పెంచేలా ఉన్నాయి కానీ.. వారి కులానికి ఏ మాత్రం మేలు చేసేలా లేవన్న విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడు కేజీఎఫ్ సమావేశాల అవసరం ఏమిటి ?
ప్రతి కులానికి సంఘాలుంటాయి. ఎవరి కులంపై వారికి అభిమానం ఉంటుంది. ఇతర కులాల్ని ద్వేషించనంత వరకూ కులాభిమానంపై ఎవరికీ వ్యతిరేకత రాదు. కానీ అతిగా అతిశయోక్తులు చెప్పుకున్నప్పుడే అసలు సమస్య వస్తుంది. సాధారణంగా ఎన్నికల ముందు ఇలాంటి సమావేశాలు పెట్టి అన్ని పార్టీల నేతల పిలిచి అందర్నీ గౌరవించి హామీలు తీసుకుంటారు.అలాంటివి అందరూ చేస్తారు. ఇప్పటికిప్పుడు కేజీఎఫ్ అని అని ఓ సంఘం పెట్టేసి ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది. అతి ప్రసంగాలతో కమ్మ కులంపై ఇతరుల్లో వ్యతిరేకత పెంచేలా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది ?
Also read : కమ్మ మహాసభలో పరోక్షంగా చంద్రబాబు అరెస్ట్ ను ప్రస్తావించిన రేవంత్..ఏమన్నారంటే?
అమెరికాలో తానాలో కుల చిచ్చు పెట్టిన పెద్దల పనే !
కేజీఎఫ్‌ల పేరుతో చేసిన హడావుడి వెనుక .. ఎన్నారై పెద్దలే ప్రముఖ పాత్ర పోషించారన్నది బహిరంగరహస్యం. అమెరికాలో తానా లాంటి సంఘాల్లో కులాధిపత్యం అంటూ ఆరోపణలు రావడానికి.. కారణం ఆ పెద్దలే. మొదట్లో అన్ని కులాల వేదికగా ఉన్న తానా ఇప్పుడు కులసంఘంగా మారిపోయిందని కొంత మంది వ్యక్తుల తీరు వల్లనే విమర్శలు వచ్చాయి. వారంతా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చొరపడే ప్రయత్నం చేస్తున్నారు. తమకు కుల బలం ఉందని..దాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయిపోయారు. అలా చేస్తున్న ప్రయత్నాల్లోనే కేజీఎఫ్‌లు పుట్టుకు వస్తున్నాయ.
కేజీఎఫ్ మీటింగ్ తో సాధించింది ఏమిటి ?
కేజీఎఫ్ సమావేశాలు ఎందుకు పెట్టారు ?. దానికి ఏమైనా పర్పస్ ఉందా అంటే.. ఏమీ లేదు. ఆ సమావేశాల పర్పస్ కేవలం.. ఆయా కమ్మ నేతలు తమ రాజకీయ అవకాశాల కోసం.. బలప్రదర్శన కోసమే దీన్ని ఉపయోగించుకున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి మొత్తం కమ్మ సమాజంపై వ్యతిరేకత పెంచేలా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి వచ్చి కమ్మసమాజాన్ని పొగిడేసి పోయారని అనుకుంటారు. రేపు కమ్మల వ్యతిరేకతే తనకు అధికారాన్ని తెస్తుందనుకుంటే ఆయన రూటు మార్చేస్తారు. తెలంగాణలో ఆ వర్గం అండగా ఉంటుందన్న నమ్మకంతోనే పొగిడారు. ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. ఇలాంటి రాజకీయాల కోసం కమ్మ కులంపై సమాజంలో వ్యతిరేక భావనతో చర్చ జరిగేలా చేయడం .. ఆ కులానికి చేటు చేసినట్లే.
కమ్మలకు కమ్మలే శత్రువులు !
నిజానికి ఏ సామాజికవర్గంలో అయినా కులాభిమానం ఉంటుంది. అందరూ అన్ని పార్టీల్లో ఉంటారు. కానీ మిడిసిపడుతూ.. తమ వర్గం మొత్తంపై వ్యతిరేకత తెచ్చేలా కులాభిమానం ప్రదర్శించేవారు కమ్మల్లోనే కాస్త ఎక్కువగా ఉంటారు. ఆ విషయం కేజీఎఫ్‌తో మరోసారి నిరూపితమయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కమ్మలపై జరుగుతున్న వ్యతిరే్క ప్రచారానికి ఎవరు బాధ్యలు ?. తామే గొప్ప అన్నట్లుగా చేసుకుని వేసుకుంటున్న వీడియోలు దేనికి సంకేతం ?
ఒక్కటి మాత్రం నిజం.. ఇప్పుడీ కమ్మ సమావేశాలు పెడుతున్న వారైనా.. హాజరైన వారైనా కులం కారణంగా ఒక్కటంటే ఒక్క అవకాశం తెచ్చుకోలేదు. వారి ప్రతిభను నమ్ముకునే పైకి వచ్చారు. కానీ ఇలా ప్రచారాలు చేసుకోవడం వల్ల ప్రతిభావంతమైన కమ్మ యువతకు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. దాన్ని గుర్తిస్తారో.. తమ రాజకీయం తాము చేసుకుంటారో మరి !