నీది నాదీ ఒకే కథ, విరాటపర్వం… ఈ రెండు సినిమాల నుంచి విమర్శకుల ప్రశంసలైతే అందుకొన్నాడు వేణు ఉడుగుల. తనదైన మార్క్ ఈ రెండు సినిమాలతో దక్కించుకోగలిగాడు. మరీ ముఖ్యంగా రచయితగా వేణు కలం బలం ఏమిటో… విరాట పర్వం తేల్చి చెప్పింది. తనలోని పొయెటిక్ సెన్స్‌కి విరాట పర్వం అద్దం పట్టింది. కొన్ని సీన్లు డిజైన్ చేసిన విధానం చూస్తే.. మరింత ముచ్చటేస్తుంది. తనలోని భావుకత, గాఢత స్పష్టంగా అర్థమైంది. అయితే… `సినిమా`కి ఇవి మాత్రమే సరిపోవు. కమర్షియాలిటీ కూడా అర్థం కావాలి. ఆ లెక్కల దగ్గరే విరాటపర్వం తేడా కొట్టింది. సినిమాని ఏ వర్గానికి క్యాటర్ చేస్తున్నాం? ఎవరు చూడాలి? ఎవరికి అర్థం అవ్వాలి? అనే లెక్కలు వేసుకోకపోవడం వేణులో ఉన్న ప్రధానమైన మైనస్.
విరాట పర్వం విడుదలకు ముందు వచ్చిన పాజిటీవ్ వైబ్రేషన్స్… పాజిటీవ్ టాక్ తో వేణు చాలామంది హీరోలు, నిర్మాతల కంట్లో పడగలిగాడు. ఈ సినిమా విడుదలకు ముందే రెండు పెద్ద సంస్థలు వేణు ఉడుగుల చేతికి అడ్వాన్సులు ఇచ్చాయి. మైత్రీ, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థల దగ్గర వేణు అడ్వాన్స్ లు అందుకొన్నాడు. విరాట పర్వం కమర్షియల్ గా పెద్ద హిట్లు సాధిస్తాయని సితార, మైత్రీ భారీ ఆశలేం పెట్టుకోలేదు కానీ, దర్శకుడిగా వేణుకి మంచి పేరొస్తుందని మాత్రం ఊహించారు.పైగా వేణు ఉడుగుల ఇప్పటికే తన కథల్ని ఆయా సంస్థల్లో వినిపించేశాడు. విరాట పర్వం కమర్షియల్‌గా పెద్ద హిట్టయితే… ఆయా సంస్థలు నిజంగానే పెద్ద హీరోల్ని తీసుకొచ్చి నిలబెట్టేవి. కానీ.. ఆర్థికంగా విరాటపర్వం విజయం ఆశించిన స్థాయిలో లేదు.
అలాగని వేణు చేతిలో అవకాశాలు చేజారినట్టు కాదు. ఈ రెండు సంస్థలూ ఇప్పటికీ వేణుతో సినిమా చేయడానికి రెడీనే. కాకపోతే… వేణు కోరుకొన్న పెద్ద హీరోలెవరూ దొరక్కపోవొచ్చు. ఆయా సంస్థలకు అందుబాటులో ఉన్న హీరోలతో సర్దుకుపోవాలి. వేణు దగ్గర పెద్ద హీరోకి పరిపడా… కమర్షియల్ లైన్ ఉంది. సితార అయితే పవన్ తో, మైత్రీ అయితే చిరుతో చేయాలని వేణు ప్లాన్. అయితే వీరిద్దర ఇప్పుడు వేణుకి అందుబాటులో ఉండరు. కాబట్టి.. సెకండ్ టైర్ హీరోలతో వెళ్లాలి. వాళ్లకు ఈ కథ పెద్దదైపోతుంది. కాబట్టి మీడియం రేంజు హీరోని దృష్టిలో ఉంచుకొని, కమర్షియల్ లైనులో, తన మార్క్ చెడిపోకుండా ఓ కథ తయారు చేసుకోవాలి. వేణుకి ఇది కత్తిమీద సామే. అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప.. మైత్రీ, సితార సంస్థలు పెద్ద హీరోల్ని తీసుకొచ్చి వేణుతో సినిమా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఓ మెట్టు కిందకి దిగి.. మీడియం రేంజు హీరోలతో లైనప్ సెట్ చేసుకోవడం తప్ప వేణుకి మరో మార్గం లేదు.