ఆంధ్రప్రదేశ్లో అమర్నాథ్ గౌడ్ అనే పదో తరగతి విద్యార్థిని.. పాము వెంకటేశ్వరరెడ్డి అనే ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు బాధితుడు వయసు ఎంత.. హంతకుడి వయసు ఎంత ? వారిలో ఇంత వికృత ఆలోచనలు ఎలా వచ్చాయి… అన్న సంగతి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నేరస్తులు ఎంతటి నేరాన్నై చేసి తప్పించుకోవచ్చన్న వాతావరణం ఏర్పడటమే.. నేరస్తుల్లో భయం లేకుండా పోవడానికి కారణం. ఓ ఎంపీ ఫ్యామిలీని రౌడీషీటర్ కిడ్నాప్ చేయగలిగాడంటేనే పరిస్థితి తీవ్రంగా ఉందనుకుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ మరణం కళ్ల ముందు తెలిసేలా చేస్తోంది.
ఏపీ యువతలో పెరిగిపోతున్న నేరప్రవృత్తి – హత్యలు చేయడాన్ని హీరోయిజంగా చేస్తున్నదెవరు ?
పట్టపగలు హత్యాయత్నాలు చేస్తే స్టేషన్ బెయిల్స్ మీద పంపేసిన చరిత్ర పోలీసులది. అడ్డగోలుగా ఇళ్లపై దాడులు చేస్తే.. కేసులు కూడా పెట్టని రికార్డు ఏపీ పోలీసులది. రాష్ట్రంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన నేరాల్లో అసలు కేసులు పెట్టనివి ఎన్నో. అదే అధికార పార్టీ అనే ముద్ర ఉంటే నేరాలకు లైసెన్స్ ఇచ్చినట్లే. నేరాలకు పాల్పడిన వారికి స్వయంగా వాళ్లకి బీపీ వచ్చిందని సమర్థించేంత వికృతమైన .. అత్యంత క్రూరమైన క్రిమినల్ మైండ్ ఉన్న నాయకత్వం ఉన్న రాష్ట్రం. శాంతిభద్రతలు అనే మాటకు చోటే లేకుండా పోయింది. రోజు వారీగా ఎన్ని దారులు జరుగుతున్నాయో చెప్పడం కష్టం.
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన పాపం ఎవరిది ?
ఒకప్పుడు నేరాలు చేయాలంటేనే నేరగాళ్లు వణికిపోయేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయరనే ధీమా పెరిగిపోయింది. స్వయంగా హంతకుల్ని కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు కూడా రంగంలోకి దిగుతున్నారని తెలిసిన తర్వాత ఇక చంపాలనుకుంటున్న నేరస్తులకు అడ్డేముంటుంది.?. తన సోదరిని వేధించవద్దన్నందుకు.. అమర్నాథ్ గౌడ్ ను.. పెట్రోల్ పోసి చంపేసిన వెంకటేశ్వరరెడ్డికి అసలు ఆ ఆలోచన రావడానికి .. ఇలాంటి పరిస్థితులే కారణం. మరి ఈ తప్పు ఎవరిది ?
ఇప్పటికైనా మేలుకోకపోతే.. తర్వాత బాధితులయ్యేది మీ కుటుంబమే !
ఇంత దారుణాలు జరుగుతున్నా.. కులం, మతం, ప్రాంతం, పార్టీ పేరుతో.. నేరస్తులకు మద్దతిచ్చే వారి సంఖ్య ఏపీలో తక్కువేం లేదు. అందుకే పరిస్థితి దిగజారిపోతోంది. కానీ ఇవాళ వేరే కుటుంబానికి వచ్చిన కష్టం.. రేపు ఇలా సమర్థించే వారికి తప్పక వస్తుంది. ఎందుకంటే.. అతీతులు కాదు. నేరస్తులకు.. తన మన అనేది ఉండదు. నేరస్వభావం అంటేనే ఇది. అప్పట్లో ఇలాంటివి సమర్థించి.. ఇప్పుడు బాధితులుగా మారి గగ్గోలు పెడుతున్నారు. అందుకే.. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. నేరస్తుల నుంచి.. నేరస్వభావం ఉన్న వారి నుంచి.. హత్యలు చేయాలనే ఆలోచనలు పెంచే నాయకుల నుంచి దూరంగా ఉండాలి. లేకపోతే తర్వత బాధితులయ్యేది మీ కుటుంబమే.