రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ ‘ఊకదంపుడు ప్రసంగాలు’ దంచేస్తుంటారు. వాటిలో విషయం ఉండదు. నిడివి మాత్రమే ఉంటుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ కూడా కొన్ని పడికట్టు పదాలతో టీడీపీ విజన్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు! రేవంత్ పార్టీ వీడిన నేపథ్యంలో స్పందించాలంటూ మీడియా సంస్థలు అడుగుతున్న ప్రతీసారీ ఒకే ఉపన్యాసం ఇస్తున్నారు. ఏ ఛానెల్ వారు పలకరించినా అదే కంటెంట్ తు.చ. తప్పకుండా బాగా ఫాలో అవుతున్నారు. ముందుగా రాసుకున్నారో, లేదంటే.. రాసిచ్చింది కంఠతా పెట్టేసి అప్పజెబుతున్నారో తెలీదుగానీ… ఒకే విషయం పదేపదే చెబుతూ ఉన్నారు.
రేవంత్ పార్టీ వీడిన నేపథ్యంలో తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుందీ అనే ప్రశ్నను ఆయన ముందు అడిగితే… నాదెండ్ల భాస్కరరావుతో రేవంత్ ను పోల్చుతూ మాట్లాడారు. నాడు ఇందిరా గాంధీ రాజకీయం చేసి నాదెండ్ల భాస్కరరావు ద్వారా ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడి చేశారన్నారు. నేడు రాహుల్ గాంధీ రహస్య సమావేశాలతో మరో నాదెండ్లగా రేవంత్ ను తయారు చేశారన్నారు. ఆయన చేసిన కుట్రలను టీ టీడీపీ నాయకులు పక్కాగా బట్టబయలు చేశారన్నారు. అన్నీ గమనించి, పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ కుట్రల నుంచి, కుంతియా కుతంత్రాల నుంచి పార్టీ కాపాడుకున్నామనీ, వాటన్నింటినీ బట్టబయటలు చేశామని ఎల్. రమణ చెప్పారు. అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట రేవంత్ రెడ్డి అన్నారు. 1982 నుంచి నేటి వరకూ పొత్తుల విషయమై ఎన్నికల సమయంలో మాత్రమే చర్చించడం పార్టీ సంప్రదాయం అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ జెండాని వచ్చే ఎన్నికల్లో రెపరెపలాడేలా చేస్తామన్నారు. కుట్రలు భగ్నం చేశాం, పార్టీకి సమర్థ నాయకత్వం ఉంది, కార్యక్షేత్రంలోకి కార్యోన్ముఖులై వెళ్తాం, పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని రమణ చెప్పారు.
రేవంత్ రెడ్డిది అవకాశవాద రాజకీయం అనేశారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తో పోల్చారు. కుట్రలను భగ్నం చేసి పార్టీని కాపాడుకున్నాం అన్నారు. అంతేతప్ప.. పార్టీ అధ్యక్షుడిగా భవిష్యత్ కార్యాచరణ ఏంటనే స్పష్టత ఇందులో ఎక్కడైనా ఉందా..? కార్యకర్తలకు భరోసా ఇచ్చే వ్యాఖ్యలు కొన్నైనా ఉన్నాయా..? తెరాసతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశంపై కూడా స్పష్టంగా మాట్లాడలేదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివేసినట్టే మాట్లాడారు. రేవంత్ ఎపిసోడ్ గురించి ఎవరు ఎన్నిసార్లు ప్రశ్నిస్తున్నా… నాదెండ్ల, కుట్రభగ్నం, కార్యోన్ముఖులమై వెళ్తాం.. ఇవే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం ఇలా ఉంది మరి!