జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటి నుంచి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని.. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీతో సందర్భం లేని పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆయన అమరావతిని కాపాడాలనే లక్ష్యంతోనే.. బీజేపీ ఆ దిశగా ఇచ్చిన హామీతోనే పెట్టుకున్నట్లుగా చెప్పారు. కానీ తర్వాత ఏమయిందో కానీ సైలెంట్ అయ్యారు. అధికారిక నిర్ణయం రాలేదని .. మరొకటని చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజధాని ఉద్యమం పీక్స్‌కి చేరింది. రైతులు పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో జనసేనాని కూడా ప్రత్యక్షంగా మద్దతు తెలుపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
రాజధానిపై కుల ముద్ర పడటానికి పవన్ కల్యాణ్ కూడా ఓ కారణం. ఆయన టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు.. పొత్తులో ఉన్నప్పుడు కూడా వాళ్ల మాటలు.. వీళ్ల మాటలు విని రాజధానిపై కుల ముద్ర వేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఎవరి రాజధాని అమరావతి అంటూ ఐవైఆర్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత కులాల ప్రకారం భూములు ఇవ్వాలనే డిమాండ్లను కూడా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతిపై కుల ముద్ర వేసే ఓ ప్రక్రియలో పవన్ కూడా భాగమయ్యారు. ఇది వ్యూహాత్మకంగా జరిగిందా లేక పవన్ ట్రాప్‌లో పడిపోయారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం అమరావతి రైతులకు జరిగిపోయింది.
బీజేపీతో పొత్తు వల్ల అమరావతి రైతుల విషయంలో పవన్ కల్యాణ్ దూకుడుగా వెళ్లలేకపోయారు. కానీ ఇప్పుడిప్పుడే ఆయన అలాంటివి దూరం చేసుకుంటున్నారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిచారు. విశాఖలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఇంత కాలం ఏం చేశారన్న విమర్శలు వస్తున్నా… ఇక ముందు జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజధాని అంశంపైనా పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా బరిలోకి దిగాలని వారికి మద్దతుగా పదమూడు జిల్లాల ప్రజలను కూడగట్టే కార్యక్రమాలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పవన్ కల్యాణ్ ఈ అంశంపై ఎలాంటి కార్యాచరణ.. ఎప్పటికి ఖరారు చేసుకుంటారో చూడాలి!