ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అలా ఫిర్యాదు అందిందో లేదో, ఇలా కేసు నమోదు కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదేళ్లుగా వ్యవస్థలన్నింటిని కనుసైగలతో శాసించిన సజ్జలపై కేసు. అదీ క్రిమినల్ కేసు నమోదు చేయడం ధైర్యంతో కూడుకున్న పనే. మరి పోలీసులకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఇప్పుడు ఏపీలో బిగ్ డిబేట్.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక సజ్జలే అన్ని తానై నడిపించారనేది ఓపెన్ సీక్రెట్. శాఖ ఏదైనా సుప్రీమో సజ్జలేనని… ప్రధానంగా పోలీసు శాఖ ఆయన అదుపాజ్ఞలో నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ సైతం ఆయనకు ఇచ్చే ప్రాధాన్యతను చూసి మంత్రులు సజ్జల పెత్తనంపై ఫిర్యాదు చేసేందుకు వెనుకాడే వారనే టాక్ ఉండనే ఉంది. పోస్టింగులు, బదిలీలు అన్నీ ఆయన ఆదేశాల మేరకే జరిగేవని విమర్శలను మూటగట్టుకున్నారు.
అందుకే సజ్జల అనుచిత వ్యాఖ్యలు బహిరంగంగా చేసినా పోలీసులు చూసి చూడనట్టు వదిలేశారు. సజ్జలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా లైట్ తీసుకునేవాళ్ళు. కానీ, తాజాగా ఓ అంతర్గత సమావేశంలో సజ్జల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే క్రిమినల్ కేసు నమోదు చేయడం చూసి విపక్ష నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సజ్జలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సంకోచించకుండా నిర్ణయం తీసుకున్నారంటే, వైసీపీ ఓడుతుందని పోలీసులు అంచనాకు వచ్చారని… ఇది వైసీపీ పతనానికి సంకేతమని అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.