ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ వైయస్ జగన్ పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 120 నియోజక వర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఆయనతోపాటు కొంతమంది వైకాపా నేతలూ పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. ప్రతీరోజూ యాత్రలో పాల్కొనేందుకు స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున రావాల్సి ఉంటుంది. నవంబర్ 2 నుంచి జిల్లాలవారీ రాష్ట్రవ్యాప్తంగా వైకాపా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఆర్నెలల్లోపు చంద్రబాబు సర్కారు పునాదులు కదలించడమే ఈ పాదయాత్ర లక్ష్యం అని చెబుతున్నారు. అంతా బాగానే ఉందిగానీ… ఇంత భారీ లక్ష్యంతో చేపడుతున్న పాదయాత్రకి ఖర్చులు కూడా అంతే భారీగా ఉంటాయి కదా!
గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినాటి పరిస్థితిలు వేరు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి, అది జాతీయ పార్టీ కాబట్టి… నిధుల పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. ఇక, చంద్రబాబు పాదయాత్ర విషయానికొస్తే… టీడీపీ సంస్థాగతంగా బలమైన పునాదులున్న పార్టీ, ఎన్నోయేళ్ల అనుభవం ఎలాగూ ఉంది. కాబట్టి, చంద్రబాబు పాదయాత్ర చేపట్టే సమయానికి ఖర్చుల సమస్యా పెద్దగా లేదనే చెప్పాలి. చంద్రబాబు పాదయాత్ర జరుగుతున్నప్పుడు రోజుకి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చయ్యేదని టీడీపీ నేతలు చెబుతారు. ఇంత ఖర్చు ఉంటుందా అంటే… కచ్చితంగా ఉంటుంది! ఎందుకంటే, పాదయాత్ర చేపడుతున్న నాయకుడికి రక్షణగా కొంతమంది వస్తారు, నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు! వీరందరికీ ప్రతీరోజూ ఎక్కడో చోట బస ఏర్పాటు చేసుకోవాలి, భోజన సౌకర్యాలు చూడాలి. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విషయాకొనిస్తే… ఆయన బస కోసం అత్యాధునిక సదుపాయలతో ఉన్న ఒక బస్సును సిద్ధం చేసుకున్నారట! ఆయనతో తరలివచ్చే నాయకులకు టెంట్లు లాంటి తాత్కాలిక ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఉంటాయని చెబుతున్నారు. ఇక, జగన్ యాత్ర చేరుకునే చోట సభల నిర్వహణ, జనాల తరలింపు వంటివి కూడా ఉంటాయి కదా.
యాత్ర ఖర్చంతా తానే భరిస్తానని జగన్ అన్నట్టూ ఈ మధ్య వార్తలొచ్చాయి. కానీ, వైకాపా నేతలు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా పాదయాత్ర ఖర్చులు మేం చూసుకుంటామని చెప్పినట్టూ కథనాలు వినిపించాయి. స్థానిక నేతలు జనసమీకరణలు మాత్రమే చూసుకుంటే చాలని వీరు చెబుతున్నారట! కానీ, పార్టీ స్థానిక నేతలపై ఎంతో కొంత భారం పడటం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే, స్థానికంగా సభల ఏర్పాటు, జనాల తరలింపు వంటి ఖర్చులన్నీ స్థానిక నేతలపైనే పడుతుంది కదా.
ఏదేమైనా… ఒక పాదయాత్రకి, కేవలం ప్రచారం కోసం జరుగుతున్న ఈ యాత్రకి కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. జన సమీకరణ, సభల నిర్వహణకీ స్థానిక నేతలు ఖర్చులు పెట్టేసుకుంటారని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము వారికి ఎక్కడి నుంచి వస్తోందనేది కాసేపు పక్కనపెడితే… ఇదే ఖర్చును ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలకో, ఉపయోగపడే పనులకో వెచ్చించి ఉంటే ఎంత బాగుంటుంది! మంచి పనులకు మించిన ప్రచారం ఏదైనా ఉంటుందా చెప్పండీ.