శంకర్ – కమల్‌హాసన్ కలసి మళ్లీ పనిచేస్తున్నారు, అదీ.. భాయతీయుడుకి సీక్వెల్ అనగానే – అందరి కళ్లూ పెద్దవైపోయాయి. వీరిద్దరి కాంబో అంటేనే ఓ సంచలనం. అందునా… భారతీయుడు 2. నిర్మాతగా దిల్ రాజు ఫిక్సవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా ఆసక్తి డబుల్, ట్రిపుల్ అయిపోయాయి. అయితే క్రమంగా ఈ సినిమాపై నీలి నీడలు కమ్ముకోవడం మొదలైంది. దిల్‌రాజు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్నట్టు వార్తలొస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లిపోయిందట. అయితే.. ఇక్కడే మరో మెలిక కూడా పడింది. ఈ సినిమాకి ఏఎం రత్నం మోకాలు అడ్డుతున్నారని టాక్. `భారతీయుడు`కి ఆయనే నిర్మాత. ఆ టైటిల్‌పై హక్కు తనకే ఉందని, భారతీయుడు కి సీక్వెల్ చేస్తే తానే చేయాలని వాదిస్తున్నార్ట. లేదంటే లాయల్టీ కింద భారీ మొత్తం ఇవ్వాలని షరతు విధిస్తున్నారని తెలుస్తోంది. లాయల్టీ మొత్తం విని శంకర్, దిల్ రాజులు సైతం షాక్ తిన్నారని సమాచారం. ఈ తలనొప్పి భరించలేకే దిల్‌రాజు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారన్న వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం లైకా – రత్నం మధ్య చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం. వారిద్దరూ ఓ అంగీకారానికి వస్తే తప్ప ఈ ప్రాజెక్టు కదలదు. లేదంటే `భారతీయుడు 2` పేరు, కాన్సెప్టులు మార్చుకోవాల్సిందే.