హైదరాబాద్: అందరూ నితీష్ గురించి, లాలూ గురించి మాట్లాడుకుంటున్నారుగానీ, వారిని గెలిపించిన అసలు హీరో గురించి ఎవరూ మాట్లాడుకోవటంలేదు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో, గత ఏడాది పార్లమెంట్ ఎన్నికలలో మోడికు అనూహ్య విజయాలు సాధించిన ఒక బ్యాక్ రూమ్ బాయ్ ఇప్పుడు నితీష్‌ను గెలిపించటం సినిమాటిక్‌గా ఉన్నా, ఇది నిజం. ఆయనే 38 సంవత్సరాల ప్రశాంత్ కిషోర్!
ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ నిపుణుడిగా పనిచేస్తున్నప్రశాంత్, 2011లో ఆ ఉద్యోగం వదిలి ఇండియా వచ్చేశారు. తనలాంటి భావజాలమే ఉన్న కొందరు వృత్తి నిపుణులతో కలిసి 2012 గుజరాత్ ఎన్నికలలో మోడిని ముఖ్యమంత్రిగా గెలిపించటానికి రంగంలో దిగారు. అక్కడ లక్ష్యాన్ని సాధించిన తర్వాత గత ఏడాది పార్లమెంట్ ఎన్నికలలో మరింత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడిని గెలిపించే ఆ ప్రాజెక్ట్‌లో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి మోడిని సోషల్ మీడియా ద్వారా, చాయ్ పే చర్చ, లైఫ్ సైజ్ హాలోగ్రామ్స్ ద్వారా ప్రజలకు దగ్గరగా చేర్చారు. అయితే ఎన్నికలలో విజయం తర్వాత అమిత్ షా, ఆరెస్సెస్ వర్గాలు తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోవటంతో నొచ్చుకుని బయటకు వచ్చేశారు. మధ్యవర్తుల ద్వారా మోడికి ప్రస్తుతం బద్ధ శత్రువుగా మారిన నితీష్‌తో చేతులు కలిపారు. బీహార్‌లో పోల్ మేనేజిమెంట్ తాను తీసుకుంటానని, అయితే తనకు కొన్ని షరతులున్నాయని నితీష్‌కు ఖరాఖండిగా చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మాంఝీని దించి నితీష్ అధికారం చేపట్టటం ప్రశాంత్ సూచన మేరకే జరిగింది.
ఇక ఇటీవలి ఎన్నికలలో ప్రశాంత్ నేతృత్వంలోని వార్ రూమ్ కీలక పాత్ర పోషించింది. ఐఐటీ, ఐఐఎంలలో చదువుకుని ప్రస్తుతం ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న నిపుణులు ఈ వార్ రూమ్‌లో పనిచేశారు. ఫేస్ బుక్, వాట్సప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రతి నియోజకవర్గంలోని ఓటర్లతో మమేకమయ్యారు. నితీష్ కూటమి ప్రచారం ప్రారంభించకముందే లక్షలాది ఓటర్లకు ఎస్ఎంఎస్లు పంపించారు. నితీష్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ, ఆయననుంచి సలహాలు తీసుకుంటూ పనిచేశారు. బీహారీల డీఎన్ఏ గురించి మోడి వ్యాఖ్యలు చేసినపుడు ప్రశాంత్ వ్యూహం మేరకు, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ప్రజలనుంచి గోళ్ళను, వెంట్రుకలను సేకరించి ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి ఒక లారీలో పంపించారు. మైక్రో మేనేజిమెంట్ స్కిల్స్ ఉపయోగిస్తూ, కొత్త కొత్త వ్యూహాలతో ప్రచారం చేశారు. ప్రచారం చేసే కార్యకర్తల సైకిళ్ళకు జీపీఎస్ బిగింపచేశారు. డోర్-టు-డోర్ క్యాంపెయిన్‌కు మహిళలను రంగంలోకి దించారు. ఈ వ్యూహాలన్నింటిపై బీహార్ మహాకూటమి నాయకులు అనుమానంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అవే ఘనవిజయం సాధించిపెట్టాయి.