జులై నెలాఖరుకు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని లీకులు ఇచ్చిన హైకమాండ్.. ఆగస్టు మాసం వచ్చేసినా ప్రెసిడెంట్ పోస్ట్ పై ఎటు తేల్చలేకపోయింది. ఒకరికి ఒకే పదవి విధానం అమల్లో ఉండే బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి మరో నేతకు పగ్గాలు అప్పగించాల్సి ఉన్నా తాత్సారం చేస్తోంది.
బీజేపీలో అధ్యక్షుడి పోస్ట్ కోసం సీనియర్ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాజాసింగ్ లు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి ఆశించి భంగపడిన ఈటలకు హైకమాండ్ నుంచి అప్పట్లో పిలుపు అందటంతో ఆయనకే అధ్యక్ష పదవి ఖాయమని ప్రచారం జరిగింది.
Also Read : ఆఖరికి.. ఆడవారిని ముందుపెట్టి బీఆర్ఎస్ ఆట!
అధిష్టానం కూడా ఈ దిశగా లీకులు ఇవ్వడంతో కొంతమంది నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కారణం ఏంటో కానీ, ప్రెసిడెంట్ పోస్ట్ విషయంలో కాంగ్రెస్ నాన్చుతున్నట్లు బీజేపీ కూడా నాన్చుతోంది. అధ్యక్షుడి నియామకంలో బీజేపీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం… త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంలో వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రెసిడెంట్ పోస్ట్ కోసం పార్టీలో పోటీ అధికంగా ఉండటం…స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పగ్గాలు అప్పగింత పార్టీలో వివాదాలు, విభేదాలకు కారణం అవుతుందా..? అని హైకమాండ్ ఆగిపోయిందా..? మరేదేమైనా కారణమా..? అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.