అనకాపల్లి ఎంపీ.. ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీను .. భీమిలి అసెంబ్లీ టిక్కెట్ ఏ పార్టీ ఇస్తే.. ఆ పార్టీనే తన చాయిస్‌గా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. ఈ సారి అసెంబ్లీకి వెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు. చాలా రోజులుగా ఆయన తన కోరికను టీడీపీ హైకమాండ్ వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. టిక్కెట్ల కసరత్తు సమయానికి… సర్దుబాటు చేద్దామని… టీడీపీ హైకమాండ్ అనుకుంది. ఇప్పుడు టిక్కెట్ల కసరత్తు చివరి దశకు వచ్చింది. అవంతికి.. భీమిలి టిక్కెట్ పై ఎలాంటి సూచనలు రాలేదు. పైగా.. అక్కడ నుంచి తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పదే పదే చెబుతున్నారు. గంటాను కాదని… అవంతికి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని… అదీ కూడా .. భీమిలి నుంచే పోటీ చేస్తానని… దీని కోసం వైసీపీలో చేరడానికి కూడా రెడీ అని.. అవంతి సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా భీమిలిలో సరైన నాయకుడు లేరు. అవంతి అయితే… గంటాకు గట్టి అభ్యర్థి అవుతారని…జగన్ కూడా..ఓ అంచనాకు వచ్చి… పార్టీలోకి వస్తే టిక్కెట్ ఇస్తామని కబురు పంపించారు. టీడీపీ అధిష్ఠానం ఏ విషయం తేల్చకపోవడం, ఇదే సమయంలో వైసీపీ భీమిలి సీటు ఆఫర్ చేయడంతో ముత్తంశెట్టి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరపున… ఆయన మొదట్లో.. భీమిలి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పీఆర్పీ ఐదేళ్ల ప్రస్థానం ముగిసేనాటికి.. కాంగ్రెస్‌లో తేలారు. రాష్ట్ర విభజన తర్వాత.. గత ఎన్నికల ముందు గంటాతో కలిసి… టీడీపీలో చేరారు. టిక్కెట్ల లెక్కల్లో అనకాపల్లి ఎంపీ సీటు దక్కింది. గంటా శ్రీనివాస్ భీమిలి దక్కించుకున్నారు. ఇప్పుడు మాత్రం.. తన సీటు భీమిలి కాబట్టి.. తనకే కావాలని పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా.. ఈ విషయంలో… అవంతి శ్రీనివాస్‌ను సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. టీడీపీలోకి రావడానికి విశాఖలో చాలా మంది సీనియర్లు రెడీగా ఉన్నారు.