తెలంగాణ రాష్ట్ర గీతం చుట్టూ వివాదం నడుస్తోంది. అందెశ్రీ రాసిన ఈ పాటని… తెలంగాణ జాతీయ గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి, గౌరవించింది. ఈ పాటకు ట్యూన్ చేసే బాధ్యత కీరవాణికి కట్టబెట్టింది. దాంతో… తెలంగాణ వాదులు వాదనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణకు చెందిన కళాకారులు, సంగీతకారులతోనే ట్యూన్ చేయించాలని, లేకపోతే.. తెలంగాణ కళాకారుల్ని అవమానపరిచినట్టే అంటూ అల్టిమెట్టం జారీ చేశారు. ఈ విషయమై టీఆర్ఎస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలకు దిగింది. అయితే.. ఈ టీమ్ లోకి కీరవాణినిని తీసుకురావాలన్న ఆలోచన గీత రచయిత అందెశ్రీదే అని తేలింది.
అందెశ్రీ కూడా కీరవాణితో ట్యూన్ చేయించడాన్ని సమర్థించుకొంటున్నారు. కళకు ప్రాంతీయ బేధాలు అంటించొద్దని సూచిస్తున్నారు. అంతేకాదు.. కీరవాణిలా మంచి బాణీల్ని అందించే సత్తా ఉన్న సంగీత దర్శకులు తెలంగాణలో ఎవరున్నారో చెప్పమని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి కూడా ఈ విమర్శల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా.. పాటని వీలైనంత త్వరగా ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ పాటకు సంబంధించిన 3 వెర్షన్లను కీరవాణి రెడీ చేశారు. ఆ మూడింటిపై రాజముద్ర ఆల్రెడీ పడిపోయింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పాటని విడుదల చేయనున్నారు.