గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ వచ్చారు. ఆయన ఏపీ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో అవాస్తవాలు ఉన్నాయేమో కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించే అంశాలు మాత్రం పెట్టలేదు. ముఖ్యంగా మూడు రాజధానులు, వికేంద్రీకరణ అంటూ వివాదాస్పద అంశాలను మాత్రం చొప్పించలేదు. ప్రభుత్వం ఆమోదించే ప్రసంగాన్ని గవర్నర్ చదువుతారు. అయితే రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడే అంశాలుంటే మాత్రం… గవర్నర్ అభ్యంతరం పెట్టవచ్చు. పరిస్థితి అక్కడి వరకూ తెచ్చుకోవాలని అనుకోని ప్రభుత్వం మూడు రాజధానులు.. వికేంద్రీకరణ అనే మాటలను గవర్నర్ స్పీచ్‌లో రాకుండా చూసుకుంది.
అలాగే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా మూడు రాజదానులంటూ హడావుడి చేయడం వైసీపీకే చెల్లింది. ఈ సారి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. అయితే మూడురాజధానుల గురించి మాట్లాడలేదు. నిజానికి అసలు మూడు రాజధానుల బిల్లు పెట్టే అవకామే లేదు.ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. అది తేలిన తర్వాత ఏదైనా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం.. చట్టాలకు తమదైన భాష్యాలు చెప్పుకుని… గతంలో బిల్లును పాస్ చేసి గవర్నర్ కు పంపింది. అప్పటి గవర్నర్ సంతకం పెట్టేశారు కూడా. కానీ ప్రస్తుత గవర్నర్ ఆ టైప్ కాదని అర్థమయిందేమో కానీ.. అలాంటి వాటి జోలికెళ్లలేదు.
మరో వైపు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా పని చేసిన న్యాయమూర్తి చేత ప్రసంగంలో అబద్దాలు చెప్పించారని టీడీపీ మండిపడింది. ఏపీలో గొప్ప పారదర్శక పాలన అందిస్తామని చేస్తున్న ప్రచారం అంతా తప్పేనని జరగని వాటిని జరిగినట్లుగా చెప్పించారని మండిపడింది. ప్రాజెక్టులు కట్టేశామని పోలవరం, వెలిగొండ వంటి ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని గవర్నర్ చదువుతున్నప్పుడు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.